ఐపీఎల్-2023 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే జట్టేదే తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-2తో సీఎస్కే ప్రత్యర్థి ఎవరో తెలిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఈ ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్ధానికి తెరదీశారు.
ఐపీఎల్ విజేత ఎవరో మరో రెండు మ్యాచులతో తేలిపోనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో ప్లేస్ కోసం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌తో ఫైనలిస్ట్ ఎవరో క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు మాటల యుద్ధానికి తెరదీశారు. ముంబై టీమ్‌పై గతంలో హార్దిక్ చేసిన కామెంట్లు.. ఈ మ్యాచ్‌ను ఇప్పుడు మరింత ఉత్కంఠగా మార్చేశాయి. పాండ్యా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ముంబై సారథి రోహిత్ ఆ కామెంట్స్‌కు జవాబిచ్చాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్ మొదలవ్వడానికి ముందే వాతావరణం హీటెక్కింది. రోహిత్ చేసిన కామెంట్స్ సూటిగా పాండ్యాను టార్గెట్‌గా చేసుకునేలా ఉన్నాయి. దీంతో నేటి మ్యాచ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ అనేలా మారిపోయింది.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పలు జట్ల తీరుపై హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలు చేశాడు. ‘గెలిచేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, పలు చోట్ల నుంచి మంచి ప్లేయర్లను తెచ్చుకొని, టీమ్‌లోకి చేర్చుకొని నెగ్గడం. ముంబై ఇలాగే చేస్తుందనుకుంటున్నా. గతంలో మేం గెలిచిన సమయాల్లో ఇలాగే చేశాం. రెండోది.. మనం నెగ్గేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడం. ఇది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ విధానం. ప్లేయర్లకు సౌకర్యవంతమైన పరిస్థితులను కల్పించి, వారి దగ్గర నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబడుతుంది సీఎస్కే. బెస్ట్ ప్లేయర్స్ టీమ్‌లో ఉండటం కాదు.. అత్యుత్తమ వాతావరణం ఉండాలి’ అని పాండ్యా అప్పట్లో జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే హార్దిక్ వ్యాఖ్యలపై రోహిత్ వెంటనే స్పందించలేదు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు.
క్వాలిఫయర్స్-1లో ఆకాశ్ మధ్వాల్ (5/5) అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో హార్దిక్‌కు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ రోహిత్‌కు దొరికింది. దీంతో లక్నోపై గెలుపు తర్వాత జియో సినిమాతో మాట్లాడుతూ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా, హార్దిక్ ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా ముంబై అదే బాటలో పయనిస్తోందన్నాడు హిట్‌మ్యాన్. తిలక్ వర్మ, నేహాల్ వధేరా ఇప్పుడు అదే పద్ధతిలో ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. రెండేళ్ల తర్వాత తమ టీమ్‌ను సూపర్ స్టార్లతో నిండిన జట్టని అంటారని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘మేం ప్రతిభ ఉన్న ప్లేయర్లను గుర్తించి తయారు చేస్తున్నాం. మేం ముందు వారి ఆటతీరును పరిశీలిస్తాం. మా టీమ్ వెళ్లి వారిని ఇక్కడకు తెచ్చుకుంటోంది’ అని రోహిత్ వివరించాడు. ఇకపోతే, దేశంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారిని సానబెట్టేందుకు ముంబై ఇండియన్స్ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంపై టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ ప్రశంసలు కురిపించాడు.