ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విక్టరీలతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. సీఎస్కే సారథి ధోని జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే గెలిపిస్తున్నందుకు కాదు.. మరో విషయంలో ధోనీని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇప్పటివరకు 4 సార్లు టైటిల్ విజేతగా నిలిచిందీ టీమ్. పదహారో సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని సీఎస్కే అదరగొడుతోంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో రెండింట్లోనే ఓడి.. ఐదు మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న చెన్నై జట్టు.. ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆ జట్టులో మిగతా టీమ్స్ మాదిరిగా స్టార్ బ్యాటర్లు, భీకరమైన బౌలర్లు, మ్యాచ్ గతినే మార్చేసే హార్డ్ హిట్టర్లు ఎవరూ లేరు. అయినా చెన్నై వరుస విజయాలు సాధిస్తోంది. సీఎస్కే విజయాల్లో వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానె, యంగ్ ఆల్‌రౌండర్ శివం దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ముఖ్యంగా రహానె అయితే భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్‌గా ముద్రపడిన అతడు.. ఈ సీజన్ ఐపీఎల్లో చెలరేగి ఆడుతున్నాడు. నీళ్లు తాగినంత సులువుగా ఫోర్లు, సిక్సులు బాదేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరు, ఏ బౌలర్లు ఎదురుగా ఉన్నారనేది పట్టించుకోకుండా ఊచకోత కోస్తున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బాల్స్‌లో ఏకంగా 71 రన్స్ చేశాడు రహానె. దీన్ని బట్టే అతడు ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే రహానె, దూబే లాంటి ప్లేయర్ల సక్సెస్ వెనుక ఒక వ్యక్తి ఉన్నారని చెప్పొచ్చు. అతడే చెన్నై సారథి ధోని. వీళ్లిద్దరి విజయం వెనుకే కాదు.. చాలా మంది సీఎస్కే ప్లేయర్లు రాణించడంలో ఎంఎస్డీ పాత్ర ఎంతగానో ఉంది.
ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలు తమ టీమ్ కలసికట్టుగా ఆడుతోందని చెబుతుంటారు. కానీ నిజానికి ప్లేయర్లు ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా పక్కన పెట్టేస్తుంటారు. కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు ఇస్తుంటాయి. ఫెయిలైతే మళ్లీ అంత సులువుగా ఛాన్స్ ఇవ్వవు. కానీ చెన్నై సూపర్ కింగ్స్, ఆ జట్టు సారథి ధోని మాత్రం దీనికి పూర్తి మినహాయింపు. ఆటగాడిలో సత్తా ఉంటే చాలు అట్టిపెట్టుకుంటారు. వరుసగా విఫలమైనా అవకాశాలు ఇస్తూనే ఉంటారు. వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వారిలోని నిజమైన ప్రతిభను వెలికితీస్తుంటారు. అందుకే వెటరన్ ప్లేయర్లు, జూనియర్లు కలిగిన సీఎస్కే ఈసారి కూడా ఐపీఎల్లో దుమ్మురేపుతోంది. టీమిండియాకు సారథిగా ఉన్న సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఎందరో ప్లేయర్లకు అండగా ఉన్నాడు ధోని.
రోహిత్, రైనా, అశ్విన్ లాంటి వాళ్లు ఫెయిల్ అయినా వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్లో కూడా సీఎస్కే విజయంలో ధోని సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు రహానె, దూబేతో పాటు ఇంతకు ముందు సీజన్లలో రాబిన్ ఊతప్ప, షేన్ వాట్సన్, అంబటి రాయుడు లాంటి చాలా మంది ప్లేయర్లను ధోని ఎంకరేజ్ చేశాడు. అందుకే వారు చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఇలాగే దమ్మున్న ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తే వారు కూడా సక్సెస్ అవుతారని విశ్లేషకులు అంటున్నారు. ధోనీలా మిగతా కెప్టెన్లు కూడా రిస్క్ తీసుకుంటేనే విజయాన్ని రుచి చూస్తారని సూచిస్తున్నారు. మరి.. ఈ విషయంలో ధోని, సీఎస్కే మేనేజ్మెంట్లా మిగతా జట్లు కూడా వ్యవహరించాలని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.