చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో ఆ జట్టు అభిమానులే కాదు.. మొత్తం టీమిండియా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. సీఎస్కే సెంటిమెంట్ భారత జట్టుకు కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి అద్భుతం చేసి చూపించింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన సీఎస్కే.. ఐదో ట్రోఫీని సగర్వంగా అందుకుంది. గుజరాత్ టైటాన్స్ టీమ్‌తో సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో లాస్ట్ బాల్‌కు విక్టరీ కొట్టింది ధోని సేన. లాస్ట్ ఇయర్ ఛాంపియన్ గుజరాత్‌కు క్వాలిఫయర్స్‌లో షాకిచ్చిన సీఎస్కే.. ఫైనల్లోనూ ఆ జట్టును ఓడించి కప్‌ను ఎగరేసుకుపోయింది. పెద్దగా స్టార్లు లేకపోయినా అందుబాటులో ఉన్న ప్లేయర్ల సేవలను మ్యాచ్ అవసరాలకు తగ్గట్లుగా వాడుకుంటూ, ప్రత్యర్థి జట్ల వ్యూహాలను తుత్తునియలు చేయడంలో చెన్నై సారథి ధోని ఫుల్ సక్సెస్ అయ్యాడు. అతడి రిటైర్మెంట్ ఊహాగానాల నేపథ్యంలో ఈ కప్ ధోనీకి ఎంతో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. సీఎస్కే టైటిల్ నెగ్గడంతో.. టీమిండియా వన్డే వరల్డ్ కప్ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.
చెన్నై ట్రోఫీ గెలవడానికి, భారత జట్టు ప్రపంచ కప్ నెగ్గేందుకు సంబంధం ఏంటనే కదా మీ డౌట్? అవును, సీఎస్కే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో ఒక సెంటిమెంట్ రిపీటైంది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఆ టోర్నీకి మన దేశమే ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఏడాది ఐపీఎల్ కప్‌ను చెన్నై ఎగరేసుకుపోయింది. ఈసారి కూడా వన్డే ప్రపంచ కప్ ఇండియాలోనే జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే నెగ్గింది. ఆ లెక్కన ఈసారి వరల్డ్ కప్ గెలిచేది టీమిండియానే అని ఫ్యాన్స్ అంటున్నారు. సీఎస్కే గెలుపుతో స్టార్ట్ అయిన 2011 సెంటిమెంట్.. భారత జట్టు వరల్డ్ కప్ వేటలోనూ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి.. ఈ సెంటిమెంట్ రిపీటై టీమిండియా వరల్డ్ కప్ నెగ్గుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.