ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన శైలి, సరైన శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు.. ఎక్కువసేపు ఏసీ రూమ్స్ లో గడపడం, శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోవడం.. ఇలాంటి వివిధ కారణాల వల్ల చాలామంది పరిమితికి మించి బరువు పెరిగిపోతున్నారు. ఈ అధిక బరువు కారణంగా అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గాలనుకుంటున్న వారు ముందుగా చేయవలసిన పని.. అన్నం మానేయడం.
అన్నంలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని తినడం ద్వారా మనం ఎక్కువ బరువు పెరిగిపోతాం. అందువల్ల అన్నానికి బదులు పుల్కా, జొన్న రొట్టె, రాగి రొట్టె లాంటివి తినొచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది మిల్లెట్స్ తినడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. ఆరోగ్యంపై శ్రద్ధతో క్రమం తప్పకుండా సిరి ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుని చాలామంది తింటున్నారు. ఇది మంచిదే.. కానీ, ఈ సిరి ధాన్యాల్ని తినేవారు.. వారి వారి శారీరక శ్రమను బట్టి తినడం మంచిది. ఎక్కువ శారీరక శ్రమచేసే వారు వీటిని ఎక్కువగా తిన్నా పరవాలేదు. కానీ, తక్కువగా శరీరాన్ని శ్రమ పెట్టేవారు మాత్రం సిరి ధాన్యాలను ఒక పరిమితమైన మోతాదులో తీసుకుంటేనే మంచిది. లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సిరి ధాన్యాలను కూడా పుల్కాలుగా చేసుకుని తింటే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పుల్కాలు తక్కువగా, కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఆకలి తీరడం కోసమని ఎక్కువ పుల్కాలు తింటే, బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకని, ఆకలిని కూర ఎక్కువగా తినడం ద్వారా తీర్చుకోవాలి. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి, తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నింటిలోకెల్లా అతి తక్కువ కార్బో హైడ్రేట్స్ ఉండే ఆహారం.. కూరగాయలు. అయితే, కూరగాయల్లో ఉండే పోషకాల కంటే ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం ఆకు కూరలు. అందువల్ల, ఆకు కూరల్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడం కోసం ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చూడండి.