దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్‌ను ఇంట్లోని పెరట్లో ఉండే చెట్ల ఆకులతోనే నయం చేసుకోవచ్చని ఒక మహిళ అంటున్నారు. పలు రకాల చెట్ల ఆకులతో షుగర్‌ను తగ్గించొచ్చని ఆమె చెబుతున్నారు.
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో షుగర్ ఒకటి. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మధుమేహం ప్రాణాంతక వ్యాధి కాదు. కానీ మందులు వాడకపోయినా, ఆరోగ్యంపై అశ్రద్ధ వహించినా మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మారుతున్న జీవనశైలి, గంటల తరబడి కూర్చొని పనిచేసే జాబ్స్, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, నిర్ణీత గంటలు నిద్రపోకపోవడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లతో యువత కూడా ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా అల్లోపతి మందులు వాడుతుంటారు. అయితే చెట్ల ఆకులతోనే మధుమేహాన్ని తరమికొట్టొచ్చని ఒక మహిళ అంటున్నారు. ఇంట్లోని పెరట్లో పెంచుకునే మొక్కల ఆకులతోనే షుగర్‌ను నయం చేయొచ్చని చెబుతున్నారు. ఇన్సులిన్ ఆకు, తిప్ప తీగతో పాటు ఆఫ్రికన్ బెటర్ లీఫ్, రణపాగాకు, దొండాకు, జామాకు లాంటివి షుగర్‌కు అద్భుతంగా పనిచేస్తాయని కొనకళ్ల సుధారాణి అనే మహిళ అన్నారు.
జామాకు, దొండాకు, రణపాగాకు వంటి వాటితో షుగర్ తగ్గుతుందంటే చాలా మంది నమ్మరని సుధారాణి చెప్పారు. కానీ హిమాలయాల్లో నుంచి ఒక ఆకు తీసుకొచ్చి, దాన్ని ప్యాక్ చేసి షుగర్ తగ్గిస్తుందంటే అందరూ నమ్మేస్తారని ఆమె తెలిపారు. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, ఒళ్లు నొప్పులు, డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఎండ తగలకపోవడం దీనికి ఒక కారణమని సుధారాణి పేర్కొన్నారు. ఎండలో డీ-విటమిన్ పుష్కలంగా ఉంటుందని.. పొద్దున 7 గంటలకు కొద్దిసేపు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలన్నారు. కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడమూ అనారోగ్యాలకు దారితీస్తోందన్నారు. కాగా.. ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి చెందిన సుధారాణి.. తన పేరు మీద ఒక ఛారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. దీని ద్వారా ఉచితంగా చెట్లను పంపిణీ చేస్తూనే.. పలు రకాల వ్యాధులతో బాధపడేవారికి మూలికలు ఇస్తూ నయం చేస్తున్నారు.