కరోనా వ్యాక్సిన్లు కల్పించే రక్షణ,వాటి సమర్థతపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ వేరియంట్లపై వాటి ప్రభావం ఏ మేరకు అనేది ప్రస్తుతం అధ్యయన దశలోనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కోవిడ్ బారినపడటం చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో వరుస ఇన్ఫెక్షన్లతో ముడిపడిన పలు కేసులు వెలుగుచూస్తున్నాయి.
ముంబైకి చెందిన 26 ఏళ్ల లేడీ డాక్టర్ సృష్టి లహరి కేసు కూడా ఆ కోవలోకే వస్తుంది. ఆమెకు 13 నెలల్లో మూడు సార్లు కొవిడ్ సోకింది. అది కూడా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆమె కోవిడ్ బారినపడటం గమనార్హం. డా.సృష్టి హళ్లారి అనే ఆ డాక్టర్ ప్రస్తుతం ముంబైలోని వీర్ సావర్కర్ ఆస్పత్రిలో కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జూన్ 17న మొదటిసారి ఆమె కోవిడ్ బారినపడ్డారు.
స్వల్ప ఇన్ఫెక్షన్ సోకడంతో త్వరగానే కోలుకున్నారు. ఈ ఏడాది మార్చి 8న ఆమె కోవీషీల్డ్ మొదటి డోసు తీసుకున్నారు. ఏప్రిల్ 29న రెండో డోసు తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబమంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న నెల రోజులకే డా.సృష్టి హళ్లారి మరోసారి కోవిడ్ బారినపడ్డారు. మే 29న డాక్టర్ సృష్టి హళ్లారికి రెండోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే స్వల్ప లక్షణాలే ఉండటంతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు.
కానీ ఆ తర్వాత మరో నెల రోజులకు మళ్లీ ఆమె ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. జులై 11న ఆమెకు మూడోసారి కోవిడ్ సోకింది. ఈసారి ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తానికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం వారికి రెండెసివిర్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ సారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. సోదరుడికి, తల్లికి మధుమేహం ఉంది.
తండ్రికి రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలున్నాయి. సోదరుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. రెండు రోజులు అతన్ని ఆక్సిజన్‌పై ఉంచి చికిత్స అందించారని మీడియాకు ఆమెతెలిపారు. రక్తంలో కొవిడ్ యాంటీబాడీస్ కోసం చేసిన పరీక్షల్లో సానుకూల ఫలితాలను వచ్చాయని పేర్కొన్నారు.