వైద్యంలో ఎన్ని అత్యాధునిక పద్ధతులు వచ్చినా… కొన్ని భయానక వ్యాధులు మనుషులను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో వ్యాధులకు వైద్యుల వద్ద జవాబు లేదు. ముందస్తు జాగ్రత్తలతోనే ఆ వ్యాధులను అరికట్టగలం. ఆద మరిస్తే అవి ప్రాణాంతకం కావచ్చు. అలాంటి భయంకరమైన వ్యాధుల్లో కిడ్నీ సమస్య ఒకటి. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. మూత్రపిండాలు శుద్ధి చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. అప్పటికి బాగా ఉన్న మనిషి తర్వాత క్షణంలో మంచాన పడవచ్చు. వ్యాధి ముదిరి చివరి దశకు వచ్చే వరకు మీరు దాన్ని కనిపెట్టలేరు. కిడ్నీ ఎలా ఉందో అని పరీక్షలు చేయించుకుంటే తప్ప దాని గుట్టు మనకు తెలీదు.
కిడ్నీ పరీక్షలు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. మధుమేహం ఎవరికి వచ్చినా వచ్చినప్పుడు మొట్ట మొదటిసారిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనూ కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. మరి ఎవరు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి అన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన సమాధానం ఉండదు. కొన్ని లక్షణాలను బట్టి అవి కనిపిస్తే గనుక తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణ మార్పులు, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలో వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు. ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకనాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో శ్వాస సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాలు పాడైనప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇది. ఏ విషయంపైనా ఎకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు చుట్టుముడుతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రం రంగుమారడం ఇలా ఏ సమస్య రాకుండా ఉండాలన్నా రోజూ క్రమం తప్పకుండా మంచినీరుని బాగా తాగాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే.. మనిషి మరింత ఆరోగ్యంగా ఉండగలడు.