ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే లక్షల్లో డబ్బులు చాలా మంది ఖాతాల్లో నుంచి సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. ఈ కేటుగాళ్లు అనేక మార్గాల్లో ప్రజలపై సైబర్ దాడి చేసి నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అలాంటి ఘటనే ఒకటి కలకలం రేపింది. కిడ్నీ అమ్మితే ఏడు కోట్ల ఇస్తామని.. ఇంటర్ యువతిని నమ్మించిన సైబర్ కేటుగాళ్లు.. ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేస్తారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఓ యువతి ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా ఆ యువతి ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. ఈక్రమంలోనే ఆ విద్యార్థినికి ఆన్ లైన్ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు.. కిడ్నీ అమ్మితే ఏడు కోట్లు ఇస్తామని నమ్మించారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ విద్యార్థిని కిడ్నీ అమ్మడానికి సిద్ధపడింది. ఈక్రమంలో సైబర్ దొంగలు ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మూడు కోట్లు జమ అయినట్లు చూపించారు. అయితే ఆ సొమ్ము విడుదల కావాలంటే కొంత డబ్బులు కట్టాలని.. విడతల వారీ ఆ యువతి నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు. చివరకు కిడ్నీ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన విద్యార్థిని అసలు విషయం తెలుసుకుని ఖంగతిన్నది. తాను మోసపోయినానని గ్రహించి.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది.
ఈవిషయంపై యువతి మాట్లాడుతూ..” నేను.. మా నాన్నకు తెలియకుండా కొంత డబ్బును వాడుకున్నాను. అయితే ఆ విషయం ఇంట్లో తెలిసే లోపే డబ్బులు తిరిగి నాన్న అకౌంట్ వేయలాని భావించాను. ఈక్రమంలోనే ఆన్ లైన్ లో స్క్రోల్ చేస్తుంటే.. “కిడ్నీ డొనేట్ యాప్” అనే లింక్ కనిపించింది. కిడ్నీ ఇస్తే వెంటనే ఏడు కోట్లు డబ్బులు ఇస్తామని ఆ యాప్ లో ఉంది. ఆ విషయం నేను నమ్మి.. లింక్ ఓపెన్ చేసి..వారికి మేసేజ్ చేశాను. దీంతో వాళ్లు కూడా ఓకే చేసి.. మీకు కిడ్నీ ఇచ్చే ముందు మూడు కోట్లు.. ఇచ్చిన తరువాత నాలుగు కోట్లు ఇస్తామని సైబర్ దొంగలు చెప్పారు. నేను నిజమే అనుకుని వారితో చాట్ చేయడం కూడా మొదలు పెట్టాను. ఈ క్రమంలో మీకు మూడు కోట్లు వచ్చాయంటూ వారు ఓ మెసేజ్ పంపించారు. డోనర్ ఫీజు రూ.9 వేలు, అని, మరోసారి రూ.35 వేలు కట్టించికున్నారు. అలానే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. అందులో మూడు కోట్లు వేశారు.
అవి నా అకౌంట్లో కి రావాలంటే టాక్స్ ఫీజులు కట్టాలని సైబర్ నేరగాళ్లు తెలిపారు. వారి మాటలు నమ్మి.. మొత్తం రూ.16 లక్షలు ఆ కౌంట్లోకి పంపాను. ఎంతకి డబ్బులు రాకపోవడంతో…నాకు మూడు కోట్లు వద్దు.. నా 16 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కోరాను. ఢిల్లీకి వస్తే ఇస్తామని వారు తెలిపారు. దీంతో ఇంట్లో తెలిస్తే కొడతారని భయంతో నేను ఒక్కదాన్నే అక్టోబర్ లో ఢిల్లీ వెళ్లాను. అక్కడి వెళ్లిన తరువాత వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో స్థానిక పోలీసులన సంప్రదిస్తే.. ఇది సైబర్ మోసం అని చెప్పారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పాను” అని ఆయువతి తెలిపింది. దీంతో తండ్రితో కలిసి ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.