పెంపుడు కుక్క కారణంగా ఓ యజమాని తన ప్రాణాలు నిలుపుకుంది. డాక్టర్లు కూడా చేయని సహాయం చేసింది. టెస్టుల్లో మాత్రమే బయట పడే విషయాన్ని ఆ కుక్క తన ముక్కుతో పసిగట్టింది.
ఈ మధ్య కాలంలో కుక్కలు మనుషుల మీద దాడులు చేస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. కుక్కల దాడుల్లో జనం పెద్ద ఎత్తున చనిపోతున్నారు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. మనుషులందరూ ఒకేలా ఉండరు అన్నట్లే.. కుక్కలు కూడా అన్నీ క్రూర స్వభావాన్ని కలిగి ఉండవు. మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చే కుక్కలు కూడా ఉంటాయి. పెంపుడు కుక్కల కారణంగా ప్రాణాలు నిలుపుకున్న వారు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. తాజాగా కూడా పెంపుడు కుక్క కారణంగా ఓ యజమాని ప్రాణాలు నిలిచాయి.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు పెంపుడు కుక్క డాక్టర్లు కూడా చేయని సహాయం చేసింది. ఆ కుక్క చేసిన సహాయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ వేల్స్‌కు చెందిన లూసీ హంఫ్రీ అనే మహిళ కిడ్నీల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెండు కిడ్నీలు పనిచేయటం మానేయటంతో డయాలసీస్ మీద కాలం వెల్లదీస్తోంది. లూసీ పరిస్థితి విషమించటంతో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఐదేళ్లలో ఆమె చనిపోతుందని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత లూసీ కృంగిపోయింది. తర్వాత రియలైజ్ అయి.. బతికినంత కాలం టెన్షన్ లేకుండా బతకాలని భావించింది.
కొద్దిరోజుల క్రితం తన కుక్కలు జేక్ అండ్ ఇండీలతో కలిసి బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో సరదాగా తిరుగుతూ ఉండగా ఇండీ లూసీ నుంచి తప్పించుకుని దూరంగా పరిగెత్తింది. లూసీ వంద అడుగుల దూరంలో ఉన్న కేటీ జేమ్స్ అనే మహిళ దగ్గరకు వెళ్లింది. ఆమెపైకి దూకుతూ.. చుట్టూ తిరగసాగింది. లూసీ ఎంత పిలిచినా అది వెనక్కు రాలేదు. కేటీ దగ్గర ఆహారం ఉందేమో.. అందుకే ఇండీ ఆమె చుట్టూ తిరుగుతోందని లూసీ అనుకుంది. తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పింది. ఇండీ పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయినా ఇండీ రాలేదు.
దీంతో కేటీ, లూసీలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. లూసీ తన కిడ్నీ సమస్య గురించి ఆమెకు చెప్పింది. తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కేటీ, లూసీ మధ్య స్నేహం పెరిగింది. దీంతో కేటీ, లూసీకి కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకుంది. కేటీకి టెస్టులు చేయించగా.. ఆమె కిడ్నీ లూసీకి సరిగ్గా సరిపోతుందని తేలింది. 22 మిలియన్ల మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఇలా పర్‌ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని తేలింది. తర్వాత కార్డిఫ్‌లోని ఆసుపత్రిలో లూసీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. లూసీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.