ఆర్థిక అవసరాలు.. మనిషి చేత ఎలాంటి పని అయినా చేయిస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు దుర్మార్గులు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక తాజాగా కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుని.. వారికి మాయమాటలు చెప్పి.. కిడ్నీ తీసుకుని.. ఆ తర్వాత బాధితుడిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లింది ఓ ముఠా. సదరు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు బాధితుడి పేరు వినయ్ కుమార్. విశాఖ, మధురవాడలో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే అతడికి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి కామరాజుతో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వినయ్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని కామరాజుతో తన బాధను చెప్పుకున్నాడు. వినయ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలసుకున్న కామరాజు.. ఇదే అదునుగా భావించి.. కిడ్నీ అమ్మితే రూ.8,50,000 వేలు వస్తాయని వినయ్‌కు చెప్పి నమ్మించాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో వినయ్ అందుకు అంగీకరించాడు. దాంతో వినయ్‌కు కేజీహెచ్ డౌన్‌లో ఉన్న విజయ హాస్పిటల్ దగ్గర కొన్ని టెస్టులు చేయించారు.
అయితే ఈ విషయం వినయ్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని మందలించారు. ఇక్కడ ఉండొద్దని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. వినయ్ హైదరాబాద్ వెళ్లాడని తెలసుకున్న కామరాజు.. అతడికి కాల్ చేసి బెదిరింపులు మొదలు పెట్టాడు. కిడ్నీ ఇస్తానని చెప్పి మోసం చేశావని.. తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి లాగుతాను.. ఇంట్లో సామాన్లు బయటపడేస్తానని కామరాజు హెచ్చరించాడని చెప్పుకొచ్చాడు వినయ్. ఈ క్రమంలో కామరాజు ఒత్తిడితో హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు వినయ్. ఆ వెంటనే కామరాజు అతడిని రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆస్పత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. కిడ్నీ తీసుకున్నట్లు చెప్పాడు వినయ్.
ఆ తర్వాత తాను ఇంటికి వచ్చాక రూ.ఐదు లక్షలు ఇచ్చినట్లు వీడియో తీయించి.. తన తండ్రికి మాత్రం రూ.2లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చాడు వినయ్. మిగిలిన మొత్తం కామరాజు తీసుకున్నాడని.. రూ.8 లక్షలు ఇస్తామని చెబితే.. తాను కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించానని.. కానీ తనకు రూ.2 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలిపాడు వినయ్. కిడ్నీ సర్జరీ తర్వాత కనీసం తనకు మందులు కూడా ఇవ్వలేదన్నాడు. ఆస్పత్రిలో కూడా తనను పట్టించుకోలేదని.. ఆ తర్వాత క్యాబ్‌లో ఇంటికి వచ్చానన్నాడు. వారం రోజులు బాగానే నడిచానని.. కానీ ఇప్పుడు తాను నడవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటుగా ఇక్కడ మరో యువకుడ్ని కూడా ఇలాగే మోసం చేశారని వినయ్ చెబుతున్నాడు. కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని భావించి.. ఇష్టం లేకపోయినా అందుకు అంగీకరించానని.. కానీ నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు వినయ్.
బాధితుడు వినయ్ కుమార్ తనకు జరిగిన అన్యాయంపై పీఎంపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలె పోలీసులు.. ఈ కేసును పెందుర్తి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.