అందరు ధనికుల్లా కాదాయన. సంపాదనలోనే కాదు దానంలో ఘనుడు. ముక్కూమొహం తెలియని పేదోడికి తన కిడ్నీని దానం చేశారు. కర్ణుడి లాంటి మనసు ఉన్న ఆ కుబేరుడు ఎవరు, ఆయన కథ ఏంటో తెలుసుకుందాం..
ధనికులు డబ్బులు లేని పేదోళ్లను పట్టించుకోరు, వారిని చిన్నచూపు చూస్తారని చాలామంది అంటుంటారు. కొందరు కుబేరుల ప్రవర్తన చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. అయితే అందర్నీ అదే గాటున పెట్టలేం. పేదోళ్ల కోసం పాటుపడే కుబేరులు కూడా ఉన్నారు. వారి అభ్యున్నతి కోసం తమ వంతు కృషి చేసేవారు ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆయనకు రూ.9 వేల కోట్లతో భారీ బిజినెస్ నెట్వర్క్ ఉంది. కేవలం రూ.1 లక్షతో చిన్న సంస్థను ప్రారంభించిన ఆయన.. రూ.11 వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో వీ-గార్డ్ ఇండస్ట్రీస్, సుమారు రూ.2,500 కోట్లతో వండర్లా హాలీడేస్ లాంటి కంపెనీలను స్థాపించి డెవలప్ చేశారు.
వ్యాపారంలో ఇంత స్థాయికి ఎదిగినా కోచౌసెఫ్ తన సేవాగుణాన్ని మాత్రం వదలడం లేదు. తన వంతుగా సమాజానికి సేవ చేస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలో తాజాగా కోచౌసెఫ్ చిట్టిలపిల్లి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక అపరిచిత పేద ట్రక్కు డ్రైవర్‌కు తన కిడ్నీని దానం చేయాలని కోచౌసెఫ్ డిసైడ్ అయ్యారు. దీనికి కుటుంబ సభ్యులు, వైద్యులు అభ్యంతరం తెలిపినా ఆయన పట్టించుకోలేదు. బాడీ ఫిట్‌గా ఉంటే రెండు కిడ్నీల్లో ఒకదాన్ని దానం చేసినా ఫర్వాలేదని చాటిచెప్పేందుకు తాను ఇలా చేశానని ఒక ప్రముఖ దినపత్రికతో కోచౌసెఫ్ తెలిపారు. ఒక బిలియనీర్ అయి ఉండి.. పేదోడికి తన కిడ్నీని దానం చేసిన కోచౌసెఫ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి అవసరం సమాజానికి ఎంతో ఉందని ప్రశంసిస్తున్నారు.