భారత్లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత రెండు, మూడు నెలలుగా ఈ వైరస్ కేసులు పెరుగుతుండటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ ఫ్లూతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో మరో వైరస్ అందర్నీ కలవరపెడుతోంది. గత రెండు, మూడు నెలలుగా దేశంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ ఫ్లూ వల్ల మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకమైన ‘హెచ్2ఎన్2’ అనే వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. హర్యానా, కర్ణాటకల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ లక్షణాలతో మృతి చెందారని పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కరోనా తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఈ మధ్య బాగా పెరిగాయి.
ఇన్‌ఫ్లుయెంజా ఫ్లూ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. హాస్పిటల్స్లో చేరికలకూ ఇది కారణం అవుతోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 90కి పైగా హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా మరో రకమైన హెచ్1ఎన్1 కేసులూ నమోదయ్యాయని సమాచారం. జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట ఈ వైరస్ ప్రధాన లక్షణాలని తెలుస్తోంది. ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5 నుంచి 7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతోంది. అయితే దగ్గు మాత్రం దాదాపుగా మూడు వారాల వరకు ఉంటోంది. దీని కారణంగా ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.