హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్లు! ఈ లెక్క మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ.., అందరికీ బాగా తెలిసిన పేర్లు మాత్రం గణపతి, సుబ్రమణ్యుడు, లక్ష్మీ, సరస్వతి… ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో త్రిమూర్తులు మాత్రం అత్యంత కీలకం! త్రిమూర్తులంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ! వీరు ముగ్గురే సృష్టికి మూలం అంటున్నాయి మన హిందూ పురాణాలు. అయితే, వీరిలోనూ ఎవరు అందరికంటే పురాతనుడు? మొట్ట మొదటి వారెవరు? సృష్టి చేసే బ్రహ్మా? స్థితి కారుడైన విష్ణువా? ప్రళయంతో సర్వం పరిహరించే హరుడా? ఎవరు అందరికంటే ముందటి వాడు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పటం చాలా కష్టం! ఒక విధంగా అసాధ్యం కూడా. కానీ.., త్రిమూర్తుల్లో ఎవరు మొదటివారని తెలియజెప్పే ప్రయత్నం శివమహాపురాణంలో మనకు ఒక చోట కనిపిస్తుంది. అందులో… ఈ సృష్టి మొత్తం ఏమీ లేనప్పుడు శూన్యం మాత్రమే ఉండేది అని చెప్పబడి ఉంది. అయితే, అప్పుడు కూడా కాలం, వెలుగు సైతం లేని ఆ స్థితిలో… సదా శివుడు మాత్రం ఉన్నాడు! ఎందుకంటే, ఆయన ఆది అంతాలు లేని సదా నిరామయుడు!
ఆయనకు వుండటం, లేకుండా పోవటం అంటూ వుండవు! అలా తనలో తానే రమిస్తున్న సదా శివుడి నుంచి ఒకానొకప్పుడు ఓ శక్తి ఉద్భవించింది. ఈమే… శివా! అంటే శివుని యొక్క స్త్రీ శక్తి అన్నమాట! నిజానికి శివా… శివుడు వేరు వేరు కాదు! ఎలాగైతే దీపం, దాని వెలుగు వేరు కాదో…. అలాగే! అటువంటి అభిన్నమైన శివ, శక్తుల కలయికతో కొన్నాళ్లు గడిచిపోయింది… ఇంతలో క్రమంగా సృష్టి మొదలైంది. ఓ సముద్రం ఆవిర్భవించి… దాని గర్భంలోంచి ఓ మహాపురుషుడు పైకొచ్చాడు! అతను శేష తల్పంపై దివ్యంగా పవళించి వున్నాడు. ఆయన కళ్లు తామర పూల మాదిరిగా విశాలంగా వున్నాయి. అణువణువునా ఆయన ఆకర్షణీయంగా వున్నాడు. అటువంటి మహోన్నతుడే… శ్రీమహావిష్ణువు అయ్యాడు! ఈ శ్రీమహావిష్ణువు కూడా తానెందుకు జన్మించాడో అర్థం కాక మొదట్లో అయోమయపడ్డాడు. అప్పుడు దేవదేవుని దివ్య వాక్కు వినిపించింది. దాని ప్రకారమే అసంఖ్యాక దివ్య యుగాల పాటూ శేష శయనుడు కఠినమైన తపస్సు చేశాడు! అప్పుడు ఆయనకు అర్థమైంది… తాను సదాశివుడైన పరమాత్మలో అనాది అంతర్బాగమని! వెంటనే ఆయన శేష తల్పంపై అలాగే యోగ నిద్రలో సేదదీరాడు. అప్పుడుతని నాభిలోంచి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం విచ్చుకుంది. అలా బ్రహ్మ ఆవిర్భావం జరిగింది!
నాలుగు ముఖాలు.. నాలుగు దిక్కులు చూస్తుండగా అయిదో ముఖం పైకి చూస్తూ వున్న పంచముఖ బ్రహ్మ… విష్ణువులాగే తానెవరో కనుక్కోలేకపోయాడు. అతనూ వంద దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా చివరకు విష్ణు దర్శనమైంది. కానీ., బ్రహ్మ తానే సృష్టి చేస్తున్న వాడిని కాబట్టి.. తనని తాను సర్వానికి మూలంగా భావించుకుని అహంకరిస్తాడు. విష్ణువు చెప్పేదంతా అబద్ధమని వాదిస్తాడు. ఇలా జరుగుతుండగా బ్రహ్మ, విష్ణువులు ఇద్దరి ముందూ ఒక అగ్ని స్థంభం ఆవిష్కృతం అవుతుంది. సదాశివుడు విధాతని, విష్ణువుని పైకి, కిందకి వెళ్లి స్థంభం అంతు చూసి రమ్మంటాడు! బ్రహ్మ పైకి బయలుదేరుతాడు! క్రిందకి వెళ్లిన విష్ణువు అగ్ని స్థంభం అంతు చూడలేక తిరిగొచ్చి ఓటమి నిజాయితీగా అంగీకరిస్తాడు. కానీ, బ్రహ్మ రజోగుణం చేత తాను స్థంభం అంతం చూసి వచ్చానంటాడు. సాక్షిగా మొగలి పువ్వును కూడా తీసుకొస్తాడు. అదంతా అబద్ధమని ముందే తెలిసిన సదాశివుడు బ్రహ్మను శపిస్తాడు. అతనికి పూజార్హత లేదని చెబుతాడు. బ్రహ్మ అబద్ధంలో పాలుపంచుకున్న మొగలి పువ్వు కూడా పూజకి పనికి రానిదై పోతుంది! ఇలా సదాశివుడు బ్రహ్మ, విష్ణువుల కంటే తానే అగ్రగణ్యుడని, ఆది అని, అంతిమం అని నిరూపిస్తాడు! మనకున్న పురాణాల్లో శివుడ్ని పరమ దైవంగా చెప్పే శివమహాపురాణం లాంటివి వున్నాయి. అలాగే, విష్ణువే విశ్వానికి మూలమని చెప్పే విష్ణుపురాణాలు కూడా వున్నాయి. అయితే, బ్రహ్మ గురించి మాత్రం ఏ పురాణమూ ప్రత్యేకంగా కీర్తించదు. మొత్తంగా చూస్తే శివుడే అందరికన్నా మొదటి వాడనేది సత్యం! దాన్నే సదా శివుడనీ, ఆది నారాయణుడని రకరకాలుగా వర్ణిస్తుంటాయి మన పురాణాలు! ఇందుకే అంటారు శివాయ విష్ణు రూపాయ … శివ రూపాయ విష్ణవే!