రామయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు దిగ్గజ తెలుగు దర్శకుడు బాపును గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
సినిమా తీయటం అన్నది ఓ గొప్ప కళ అయితే.. రామాయణం, మహా భారతం వంటి పురాణ ఇతి హాసాలను తెరకెక్కించటం అంతకు మించిన గొప్ప కళ. మెగా ఫోన్ పట్టుకున్న ప్రతీ ఒక్కరికీ రామయణ, మహాభారతాలను సినిమాలుగా తీసి మెప్పించటం సాధ్యపడదు. ఆదిపురుష్ సినిమా విషయంలో ఈ విషయం తేటతెల్లం అవుతోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాఫికల్ వండర్‌గా మాత్రమే ప్రేక్షకులను ఒప్పించగలిగింది. కానీ, పవిత్ర రామయణంగా ఎక్కడా మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు అలనాటి మేటి దర్శకుడు బాపును గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రామయణం ఇతివృత్తం నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.
దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి బాపు తన ప్రతీ సినిమాలో రామయణ ప్రస్తావన తెస్తూవచ్చారు. సినిమాలోని ఏదో ఒక అంశాన్ని రామయణంతో లింక్ చేసేవారు. కొన్ని సార్లు రామయణాన్ని నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చి సైతం సినిమాలు చేశారు. 1972లో ఆయన తెరకెక్కించిన ‘సంపూర్ణ రామయణం’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘అందాల రాముడు’ సినిమా కూడా రాముడి అంశంతోనే ముడిపడి ఉంటుంది. 1975లో ఎన్టీఆర్ హీరోగా ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ సినిమా తీశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాతి కాలంలో ఆయన తీసిన చాలా సినిమాల్లో రాముడి ప్రస్తావన తెస్తూనే వచ్చారు. చివరకు ఆయన చనిపోయే ముందు కూడా బాలకృష్ణతో ‘శ్రీరామ రాజ్యం’ సినిమా చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
దర్శకుడు బాపు తన అణువణువులోనూ రాముడ్ని నింపుకున్నారు. సినిమా విషయంలో.. ఆయన ప్రతీ ఆలోచనలో రామాయణం నిండి ఉంది. భక్తి భావంతో.. రామాయణ ప్రేరణతో ఎన్నో సినిమాలు తీశారు. ఆ సినిమాలన్నీ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. బాపు సినిమా చరిత్రలో.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మిగిలిపోయాయి. కానీ, ఆదిపురుష్ విషయంలో అలా జరగలేదు. భారీ బడ్జెట్, భారీ తారాగణం తప్ప.. అంతటా భక్తి భావం లోపించిందన్నది సినిమా విశ్లేషకుల అభిప్రాయం. దర్శకుడు సినిమాను భక్తి భావంతో కాకుండా.. రికార్డుల వేట కోసం తెరకెక్కించినట్లుగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ‘ఆదిపురుష్’ సినిమా కారణంగా తెలుగు ప్రజలు ఓ గొప్ప దర్శకుడ్ని జ్ఞప్తికి తెచ్చుకుని మురిసిపోతున్నారు. ఓం రౌత్ బాపులా ఆలోచించి ఉంటే రామయణం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యేదని, బాపునుంచి రౌత్ చాలా నేర్చుకోవాలని అంటున్నారు.