మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏవి అంటే.. పుట్టడం, వివాహం, చావు అంటారు. చావు, పుట్టుకలు మన చేతిలో లేవు. ఇక మనకు తెలిసి.. మన జీవితంలో జరిగే అతి గొప్ప వేడుక వివాహం. వెనకటి కాలంలో బాల్య వివాహాలు జరిపేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుత కాలంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చాలా మంది వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. పాతికేళ్లలోపు వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సింది పోయి.. 30 ఏళ్లు పైబడినా కూడా పెళ్లిని వాయిదా వేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుత కాలంలో యువత.. జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి అనుకుంటున్నారు. దాంతో చాలా మందికి పెళ్లీడు దాటిపోతుంది. ఆ తర్వాత సంబంధాలు రావడం కష్టం అవుతుంది.
ఈ క్రమంలో పెళ్లి కానీ వారు.. కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భోగి పండుగ రోజు ఓ పని చేస్తే.. తప్పకుండా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అంటున్నారు పండితులు. ఏం చేయాలంటే.. భోగి పండుగ నాడు జరిగే.. గోదాదేవి రంగనాథుల కళ్యాణం చూస్తే.. వివాహ యోగం ప్రాప్తిస్తుంది అంటున్నారు. భోగి పండుగ రోజున వైష్ణవ ఆలయాల్లో జరిగే గోదాదేవి రంగనాథుల కళ్యాణ వేడుక చూసేందుకు రెండుకళ్లు సరిపోవు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి జీవితంలో సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి అంటున్నారు పండితులు.
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడి అసలు పేరు భట్టనాథుడు.. అతడి దృష్టి ఎప్పుడు విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి.. కాలక్రమంలో విష్ణుచిత్తుడుగా పేరు పొందాడు. విష్ణుచిత్తుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా భావించి.. ఆయనకు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వారు) అన్న గౌరవాన్ని ఇచ్చినట్లు చెబుతారు. పెరియాళ్వారు నిత్యం విష్ణు ధ్యాసలో ఉంటూ.. ఆయన సేవ చేస్తూండేవాడు. అలా ఓరోజు తులసి మొక్కలకు పాదులు చేస్తుండగా.. ఓ చిన్నారి దొరుకుతుంది. ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టి.. అల్లారుముద్దుగా పెంచుతాడు.
తండ్రిలానే గోదాదేవి కూడా బాల్యం నుంచి కృష్ణుడిని ఆరాధించేది. వయసుతో పాటు కన్నయ్య మీద భక్తి, ప్రేమ కూడా అలానే పెరుగుతాయి. ఈ క్రమంలో కన్నయ్యను వివాహం చేసుకోవడం కోసం ఒకప్పుడు గోపికలు పాటించిన కాత్యాయని వ్రతం చేయసాగింది. అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తెలని కూడా ఈ వ్రతంలో భాగస్వామ్యం చేసుకుంది. ఈ క్రమంలో తన చెలులను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో పాశురం చొప్పున 30 పాశురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై.
గోదాదేవి ప్రేమకు కృష్ణుడు కరిగిపోయాడు. ఆమెను వివాహం చేసుకోదలిచి.. ఓ రోజు విష్ణుచిత్తునికి కలలో కనిపించి.. తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మనీ.. అక్కడ రంగనాథునిగా వెలసిన తాను. గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు.కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడు.. వెంటనే గోదాదేవినీ, శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లికూతురిగా అలంకరించుకుని.. అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భోగి పండుగనాడు.. వైష్ణవాలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి-రంగనాథుల కళ్యాణం జరుపుతారు.
ఇక పెళ్లికాలేదని బాధపడుతున్నవారు, వివాహానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు.. భోగి పండుగ నాడు.. నిండు మనసుతో భగవంతుడి ధ్యానించి.. ఆయనపై మనసు లగ్నం చేసి.. గోదా-రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. అలానే వివాహమైన వారి వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.