మహాశివరాత్రికి అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ఆలయాల మాదిరిగానే ఓ పురాతన శివాలయంలో కూడా మహాశివుడు పూజలందుకుంటున్నాడు. కాకపోతే ఆ ఆలయంలో ఆ శివయ్యకు ఏడాదికి ఒకసారి మాత్రమే పూజ జరుగుతుంది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. కేదారాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు.. మారుమూల ఉండే శివాలయాలకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఉపవాసం, జాగారణ చేస్తూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆలయాల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. అన్ని శివాలయాలు మాదిరిగా కాకుండా కొన్ని ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ఓ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
సాధారణంగానే శివాలయాలను మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే కాకుండా రోజూ తెరుస్తారు. ఆ మహాశివునికి అభిషేకాలు, నైవేద్యాలు పెడుతూ ఉంటారు. కొందరు భక్తులు కూడా రోజూ శివాలయానికి వెళ్లి ఆ పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ శివాలయంలో మాత్రం అలా జరగదు. ఆ గుడి తలుపులు కేవలం మహాశివరాత్రికి మాత్రమే తెరుచుకుంటాయి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అక్కడ శివయ్య పూజలు, అభిషేకాలు అందుకుంటాడు. మిగిలిన 364 రోజులు ఆ ఆలయం తలుపులు మూసే ఉంటాయి. అది కూడా సాధారణ ఆలయం కాదు. దాదాపుగా 10వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం. మరి ఆ తలుపులు ఎందుకు ఏడాదికి ఒకసారే తెరుస్తారో చూద్దాం.
ఈ ప్రత్యేక శివాలయం మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు సమీపంలో ఉంది. రాయ్ సెన్ జిల్లాలోనే ఈ వెయ్యేళ్లనాటి సోమేశ్వరాలయం ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో కొండపై ఈ ఆలయం ఉంది. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయం తెరుచుకుంది. ఈ శివలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత పలువురు ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. 1974లో ఈ ఆలయాన్ని సామాన్య ప్రజానీకం కోసం తెరవాలంటూ ఉద్యమాలు చేశారు. అప్పటి సీఎం ప్రకాష్ సేథీ ఈ శివాలయం తలుపులు తీసి.. శివరాత్రి రోజున పూజలు జరిపేందుకు అనుమతించారు. అప్పటి నుంచి ఈ ఆలయం తలుపులు కేవలం శివరాత్రి రోజున మాత్రమే తెరుచుకుంటాయి. శనివారం సాయంత్రం వరకు ఈ ఆలయం తెరుచుకునే ఉంటుంది. తర్వాత మళ్లీ వచ్చే మహాశివరాత్రి వరకు మూసి ఉంచుతారు.