ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిన్నవయసు వారుకూడా హార్ట్ ఎటాక్ తో అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా మన కళ్ల ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా కనిపించిన వారు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కరోనా పేరు వింటే భయపడే జనాలు ఇప్పుడు హార్ట్ ఎటాక్ పేరు వింటే గజ గజ వణికిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు.. కలిసి ఆనందాన్ని పంచుకున్నవాళ్లు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు.. దీంతో వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ పెళ్లి వేడుకలో అందరితో ఆనందంగా డ్యాన్స్ వేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా అల్లీపురం లో రాణి అనే మహిళ తమ బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లింది. బారాత్ లో డీజే సౌండ్స్ తో వధూవరుల బంధుమిత్రులు మంచి జోష్ లో డ్యాన్స్ చేస్తున్నారు. రాణి అనే మహిళ కూడా హుషారుగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. కొద్ది సేపటికే ఆమెకు స్టోక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె చనిపోవడానికి కారణం డీజే సౌండ్స్ అని కూడా వైద్యులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మృతురాలు రఘునాథపాలెం కి చెందిన రాణి అని తెలిసింది. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేసిన రాణి హఠాత్తుగా కన్నుమూయడంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రాణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ మద్య పెళ్లి వేడుకల్లో ముఖ్యంగా బారాత్ సమయంలో డీజే పెట్టడం పరిపాటిగా మారింది. కొన్నిసార్లు డీజే సౌండ్ విపరీతంగా పెంచడంతో హార్ట్ స్టోక్ తో చనిపోయిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.. అయినా కూడా ఈ విషయంపై ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు వచ్చిన వారికే గుండెపోటు సంభవించేది. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్, హార్ట్ స్టోక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు.