గుండెపోటు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మొన్నటికి మొన్న ఓ విద్యార్థిని సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకుని, తన బామ్మ పక్కన పడుకుంది. తెల్లారి గుండెలో నొప్పి అనిపించి, ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది
గుండెపోటు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మొన్నటికి మొన్న ఓ విద్యార్థిని సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకుని, తన బామ్మ పక్కన పడుకుంది. తెల్లారి గుండెలో నొప్పితో విలవిలలాడగా.. ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది. పల్నాడు జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. 13 ఏళ్లకే హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోయాడు. 18 ఏళ్లు నిండని ముక్కుపచ్చలారని పిల్లలను సైతం మహమ్మారి గుండె పోటు ప్రాణాలను తీసేసుకుంటోంది. తాజాగా మరొక బాలుడు గుండెలో నొప్పి కారణంగా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన మాదాసి రాజేశ్(14)కు చిన్న వయస్సులోనే నూరేళ్లు నిండిపోయాయి. గుండెపోటు కారణంగా రాజేశ్ మృతి చెందాడు. రాజేశ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం ఉదయం రాజేశ్ బడికి వెళ్లాడు. పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే రాజేశ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అతడికి గతంలో ఒకసారి గుండెపోటు వచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. కుమారుడి ఇక లేడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.