విశాఖ ఆర్కే బీచ్ లో మిస్సయ్యి.. నెల్లూరులో ప్రత్యక్షమైన వివాహిత సాయి ప్రియ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. తన భార్య సముద్రంలో కొట్టుకు పోయిందంటూ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో రెండు బోట్లు, హెలికాప్టర్ తో 36 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఆ వార్తతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ స్పందించారు.
పెళ్లిరోజు కావడంతో సింహాచలంలో దర్శనం చేసుకుని ఆర్కే బీచ్ కు వచ్చినట్లు తెలిపారు. భర్త సెల్ ఫోన్ చూస్తున్న క్రమంలో ఆమె కనిపించకుండా పోయిందన్నారు. అయితే అల వచ్చి లాక్కెళ్లిందని మూడో పట్టణ పీఎస్‌లో శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారన్నారు. కలెక్టర్ ఆదేశాలతో కోస్ట్ గార్డు నుంచి రెండు షిప్పులు, హెలికాప్టర్ తీసుకుని అధికారులంతా గాలించినట్లు చెప్పారు.
“ఆ యువతి నెల్లూరు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. గురువారం సాయంత్రం కల్లా ఆమెను విశాఖ తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల గాలింపు చర్యల కోసం రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అయింది.నిధులు వృథా అయ్యాయి” అన్నారు.
వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అని ప్రశ్నించగా.. “ఇలాంటి తప్పుడు సమాచారాలు అధికారులకు, పోలీసులకు ఇవ్వడం వల్ల ఈసారి నిజంగా జరిగినా.. అనుమానాలు వస్తాయి. ఎవరైనా అధికారులకు నిజమైన సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాం” అంటూ తెలిపారు. ఏం చర్యలు తీసుకోబోతున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.