స్కూటీపై ఓ జంట బరితెగించింది. జనాలు చూస్తున్నారని, రోడ్డు మీద ఉన్నామని, బహిరంగ ప్రదేశం అని కూడా చూడకుండా ప్రవర్తించింది. దీంతో అలా చేయొద్దని ఓ యువకుడు వారించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
కొన్ని ఘటనలను చూస్తుంటే దేశంలో రోజురోజుకీ విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తప్పు చేసినవారిని ప్రశ్నించడం పాపంగా మారుతోంది. తప్పు చేశావని ప్రశ్నించినా దాడులకు తెగబడుతున్నారు. అలాంటి ఓ ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న ఓ జంట బండి పైనే రొమాన్స్ చేశారు. బహిరంగ ప్రదేశమని కూడా చూడకుండా స్కూటీ మీదే ముద్దులు పెట్టుకున్నారు. దీంతో పక్కగా వెళ్తున్న ఓ వాహనదారుడు వారిని అలా చేయొద్దని మందలించాడు. పబ్లిక్ ప్లేసులో ఇలా చేయడం సరికాదని సూచించాడు. అంతే ఆ యువకుడిపై దాడి చేసి, అతడి ప్రాణాలు తీశారు.
ఘజియాబాద్‌లోని సాహిబాబాద్‌లో ఈ దారుణం జరిగింది. మనీష్ కుమార్ అనే వ్యక్తి ఒక మహిళతో స్కూటీపై వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో వాళ్లిద్దరూ బండి పైనే ముద్దులు పెట్టుకున్నారు. దీంతో అటువైపుగా మరో వాహనంపై వెళ్తున్న 27 ఏళ్ల విరాట్ మిశ్రా అనే వ్యక్తి వారిని వారించాడు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయొద్దని సూచించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మనీష్ కుమార్.. తన ఫ్రెండ్స్‌ను అక్కడికి పిలిపించాడు. అక్కడికి చేరుకున్న అతడి ఫ్రెండ్స్.. విరాట్ మీద దాడికి దిగారు. ఇటుకలు, కర్రలతో అతడ్ని చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విరాట్ మిశ్రాను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
విరాట్ మిశ్రాపై మనీష్ ఫ్రెండ్స్ దాడికి తెగబడ్డ సమయంలో అతడ్ని కాపాడేందుకు అక్కడికి వెళ్లిన బంటీ అనే వ్యక్తినీ వాళ్లు కొట్టారు. గాయపడిన మిశ్రాను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. కానీ ట్రీట్మెంట్ పొందుతూ మిశ్రా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మనీష్ కుమార్, మనీష్ యాదవ్, గౌరవ్ కసనా, ఆకాష్ కుమార్, పంకజ్ సింగ్, విపుల్ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. ఆ ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.