పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కామనే. మామూలుగా ఎవరైనా కత్తితోనే కేక్ కట్ చేస్తారు. అయితే కొందరు యువకులు అందులో స్పెషల్ ఏముందని అనుకున్నారో ఏమో! ఏకంగా నాటు తుపాకీతో కేక్ కట్ చేశారు.
ఈమధ్య యువత హద్దులు మీరుతోంది. పాపులారిటీ కోసం ఏదిపడితే అది చేసేస్తున్నారు. ముందు వెనకా ఆలోచించకుండా, దేనికీ భయపడకుండా తోచింది చేస్తున్నారు. వైరస్ అవ్వాలని కొందరు, ట్రెండ్ పేరుతో మరికొందరు బరితెగిస్తున్నారు. సరిదిద్దేవారు లేక, మంచి చెప్పేవారు లేకపోవడంతో కొందరు చెడుబాట పడుతున్నారు. మరికొందరు మాత్రం మంచి చెప్పినా పెడచెవిన పెడుతూ దురలవాట్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు యువకులు పుట్టిన రోజు వేడుకల్లో తుపాకీని వినియోగించడం కలకలం రేపింది. కత్తితో కోయాల్సిన కేకును గన్‌తో కోయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొందరు యువకులు బర్త్ డే పార్టీలో నాటు తుపాకీతో కేక్ కట్ చేశారు. గన్‌తో కేక్ కోయడమే గాక దాంతోనే ఒకరికొకరు కేక్ ముక్కలను తినిపించుకున్నారు. వీరిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడం, పోలీసుల దృష్టికి కూడా రావడంతో వాళ్లు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని హృత్రిక్ గుప్తా, లోకేంద్ర ప్రతాప్ సింగ్, ధీరేంద్రగా గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.