అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. తప్పు చేసినా దొరక్కుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలను సతమతం చేస్తున్న సమస్యల్లో ఒకటి గంజాయి. దేశ భవిష్యత్తుగా చెప్పుకునే యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తుమందుల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మన దేశమనే కాదు.. అభివృద్ధి చెందిన పలు దేశాలనూ ఈ సమస్య పట్టిపీడిస్తోంది. ఇక, సాధారణంగా అడవులు, తోటల్లో గంజాయి సాగును చేపట్టడం చూస్తుంటాం. కానీ తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే టార్గెట్తో ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచారు. అలా పండిన గంజాయిని పబ్బుల్లో, రిసార్టుల్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు.
గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈ మొక్కలను ఇంట్లోనే పెంచేందుకు గానూ పలు విదేశీ పరికరాలను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ఇంజినీర్ సహా మరో ముగ్గురు సాయంతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నైకి చెందిన శక్తివేల్ అనే వ్యక్తి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ వచ్చిన డబ్బులను క్రిప్టోకరెన్సీగా మార్చుకుని బిజినెస్ చేసేవాడు. అయితే అతడు వ్యాపారంలో డబ్బులు నష్టపోయాడు. దీంతో అక్రమంగా మనీ సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. ఇంట్లోనే గంజాయి తోటను పండించాలని శక్తివేల్ నిర్ణయించుకున్నాడు.
గంజాయి సాగు కోసం యూట్యూబ్లో వీడియోలు చేసి నేర్చుకున్నాడు శక్తివేల్. అలాగే డార్క్ వెబ్సైట్లో విదేశాల నుంచి కొరియర్ ద్వారా గంజాయిని పండించే పలు పరికరాలు, విత్తనాలను కొనుగోలు అతడు చేశాడు. మాడంబాక్కం అనే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. అందులో గంజాయి మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాడు. ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా అత్యాధునిక పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. మొక్కలకు సూర్యరశ్మి తగలనందున ప్రత్యేకంగా లైట్ సెట్టింగ్నూ అమర్చాడు. ఇలా పెంచిన మొక్కలను నాణ్యమైన గంజాయిగా తయారుచేసి అమ్మేవాడు. గత నాలుగేళ్లుగా ఇలా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు శక్తివేల్. అతడి ఇంట్లో నుంచి పదికి పైగా గంజాయి మొక్కలు, 356 బిళ్లలు, 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.