దొంగలకు దేవుడు, గుడి అనే భయం కూడా లేకుండా పోతుంది. దర్జాగా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదో ఒక వార్త వెలుగు చూస్తూనే ఉంది. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయలతో యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా కొండగట్టు ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. సుమారు 15 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. గురువారం అర్థరాత్రి 1.30 నిమిషాల సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రధాన ఆలయానికి వెనక వైపున ఉన్న బేతాళ గుడి ప్రాంతం నుంచి లోపలకు చొరబడినట్లు తెలిసింది. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితులు గర్భగుడిలోని రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం.
నిందితులు ఆలయం వెనక ద్వారం తెరిచి లోపలకు చొరబడినట్లు గుర్తించారు. ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ టీమ్స్ కొండగట్టుకు చేరుకున్నాయి. సీసీటీవీలో రికార్డయిన సమాచారం ప్రకారం ముగ్గురు యువకులు చేతిలో కటింగ్ ప్లేయర్స్‌తో ఆయలంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇక స్వామి వారి రెండు కిలోల వెండి మకర తోరణం, అర్థ మండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల బరువుండే నాలుగు వెండి శఠగోపాలు, స్వామి వారి 5 కిలోల వెండి తొడుగు చోరికి గురయినట్లు తెలుస్తోంది. మొత్తం 15 కేజీల వెండి సామాగ్రి దొంగతనానికి గురైనట్లు సమాచారం. దీని విలువ సుమారు 9 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రసుత్తం అధికారులు ఆలయాన్ని మూసివేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రి తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆలయాన్ని విస్తరించడం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తులకు మెరుగైన వసుతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టు క్షేత్రాన్ని దేశంలోనే అంత్యత సుందరమైన నిర్మాణంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.