ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో వసతులు కల్పిస్తున్నామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్నిరకాల సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని రోగులు ఆరోపణలు చేస్తున్నారు. అంబులెన్స్, వీల్ చైర్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు.. నిండు గర్భిణిల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో బయటనే ప్రసవించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వా ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మార్చామని.. ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. వైద్యుడి చేసిన నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అచ్చంపేట దర్శన్ గడ్డ తండాకు చెందిన రోజా మూడవ కాన్పు కోసం ఈ నెల 15న స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. అదేరోజు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఈ నెల 21న రోజా ను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే 22 వ తేదీన ఆమెకు తీవ్ర రక్తస్రావం అవడం మొదలైంది.. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్ కృష్ణను సంప్రదించగా ఆయన తన క్లీనిక్ కి తీసుకురమ్మని చెప్పారు. మంగళవారం రోజా పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్ హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందింది.
అసలు విషయానికి వస్తే.. ఆపరేషన్ జరిగిన సమయంలో డాక్టర్.. సదరు మహిళ కడుపులో దూది మర్చిపోవడం వల్ల ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆస్పత్రివద్ద ఆందోళన చేస్తూ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. మృతదేహంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన వైద్యాధికారులు డాక్టర్ కృష్ణను సస్పెండ్ చేశారు. మరోవైపు తన భార్య మృతి వైద్యుడు కారణం అని ఆరోపిస్తూ రోజా భర్త టీక్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో కమీషనర్ విచారణ చేపట్టారు.