సమాజంలో పెళ్లి పేరుతో మోసం చేస్తున్న యువకులు, యువతుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు ఇద్దరు, ముగ్గురు, నలుగురిని పెళ్లాడినట్లు బాధితులు చెబుతుంటే నోరెళ్ల బెట్టేవారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ప్రబుద్ధుడు అసలు నిత్య పెళ్లికొడుకు అనే పదానికి నిలువెత్తు రూపంలాంటివాడు. అతను ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం 11 మందిని వివాహం చేసుకున్నాడు. మోసపోయిన వారిలో ఇద్దరు యువతులు మీడియా ముందుకు రాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు అనే వ్యక్తి వివాహ పరిచయ వేదికల ద్వారా యువతులతో పరిచయాలు పెంచుకునేవాడు. రెండో వివాహం కోసం చూస్తున్న యువతులే లక్ష్యంగా శివశంకర్ బాబు ఒకరికి తెలియకుండా ఒకరిని వివాహం చేసుకున్నాడు. అలా ఏకంగా 11 మంది యువతులను శివబాబు వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. అందికూడా అంతా ఉన్నత విద్య చదివినవారే కావడం గమనార్హం.
పెద్ద కంపెనీలో ఉద్యోగం, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ శివబాబు మేనేజ్ చేసేవాడంట. ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. మోసపోయనవారిలో ఏడుగురు మహిళలు కొండాపూర్ ప్రాంతంలో పక్క పక్క వీధుల్లోనే ఉన్నట్లు తెలిపారు. పెళ్లి తర్వాత అవసరాల కోసమంటూ లక్షల్లో డబ్బు తీసుకునే వాడు. ఆ తర్వాత డబ్బు తిరగి ఇవ్వమని అడిగితే.. క్లయింట్ దగ్గరకు వెళ్తున్నా అంటూ ఉడాయించేవాడని తెలిపారు.
అలా దాదాపు రూ.60 లక్షల నగదు, బంగారం పోగొట్టుకున్నట్లు సోమాజీగూడా ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బాధితురాళ్లు తెలిపారు. తాను ఏపీకి చెందిన ఓ మంత్రికి బంధువునని కూడా శివశంకర్ బాబు చెప్పినట్లు బాధితులు వెల్లడించారు. తమలా మరెవరూ మోసపోకూడదనే మీడియా ముందుకు వచ్చామన్నారు. 11 మందిని పెళ్లాడిన ఈ నిత్యపెళ్లికొడుకుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.