బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగమిచ్చిన సంస్థకే కుచ్చుటోపి పెట్టాడు ఓసంస్థ ఉద్యోగి. తమ సంస్థకు చెందిన 14.40 కిలోల బంగారాన్ని మరో సంస్థలో కుదువ పెట్టి రూ.3.30 కోట్లతో బెట్టింగ్ కు పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దమ్మాయిగూడ ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్ లోన్ సంస్థలో తోట రాజ్‌కుమార్ అనే ఉద్యోగి.. బంగారం భద్రపర్చే వాల్ట్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు.
ఇటీవల ఐఐఎఫ్‌ఎల్ సంస్థలో ఆడిట్ నిర్వహించగా.. దమ్మాయిగూడ బ్రాంచ్ కు సంబంధించి దాదాపు 14.40 కిలోల బంగారం మాయమైనట్టు గుర్తించారు. బంగారం మొత్తాన్ని వాల్ట్ ఇంచార్జిగా ఉన్న రాజ్‌కుమార్ తీసినట్టు అనుమానించిన సంస్థ మేనేజర్ మల్లేశ్ యాదవ్ కీసర పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్‌కుమార్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాజ్‌కుమార్ 14.40 కిలోల బంగారు ఆభరణాలను తీసి వాటిని వివిధ ప్రాంతాల్లోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో కుదవపెట్టి రూ.3.30 కోట్ల రుణం తీసుకొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటిని 1xBET యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జూదంతోపాటు క్రికెట్ బెట్టింగ్ ఆడాడు. ఏకంగా ఒక బాల్‌పై లక్ష వరకు బెట్టింగ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక బాల్‌లో సిక్స్, ఫోర్, వికెట్, సింగిల్ రన్, ఇలా అనేక అంశాలపై బెట్టింగ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏదో ఒక బాల్‌కు తన డబ్బులు తనకు వస్తాయని ఎదురుచూస్తూ చివరకు రూ.3.30 కోట్లను పోగొట్టాడు. రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.