బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు వైద్యులు. కనబడకుండా పోయిన పదేళ్ల బాలిక చివరికి చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టారు. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. అయితే ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే బాలిక ఆడుకుంటూ చెరువులో పడిపోయిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమ కూతురి మృతి పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దమ్మాయిగూడ చౌరస్తాలో బాలిక మృతదేహంతో నిరసనకు దిగారు. దీంతో దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం నివేదిక తమకు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురి మృతిపై స్పష్టత ఇవ్వాలని, తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఇందు.. గురువారం ఉదయం స్కూల్ కెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆరోజు ఉదయం స్కూల్ కి వెళ్లిన ఇందు.. బ్యాగ్ ని స్కూల్లో వదిలేసి పార్కుకి వెళ్లినట్లు మిగతా పిల్లలు చెప్పిన విషయాన్ని హెడ్ మాస్టర్ వెల్లడించారు. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో ఆయన తన కూతురి కోసం వెతికారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ రంగంలోకి దింపగా.. ఆ డాగ్ స్క్వాడ్స్ చెరువు దగ్గరకు వెళ్లి ఆగాయి. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించి.. బాలిక మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. బడికి వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మిగతా పిల్లలు చెబుతున్నట్టు ఆ బాలిక పార్క్ దగ్గరకు నిజంగానే వెళ్లిందా? ఒకవేళ వెళ్తే.. పార్క్ కి వెళ్లి.. అక్కడ నుంచి చెరువు దగ్గరకు వెళ్లాల్సిన పని బాలికకు ఏముంది? బాలికని ఎవరైనా పిలిచారా? చెరువు దగ్గరకు ఒంటరిగానే వెళ్లిందా? లేక ఆ సమయంలో తనతో పాటు ఎవరైనా ఉన్నారా? పోస్టుమార్టం నివేదికలో బాలిక శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి? కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులకు తమ పాప మృతి సహజమే అని జీర్ణించుకోగలరా? ఈ మృతి వెనుక ఎవరో ఉన్నారని నమ్ముతున్న తల్లిదండ్రుల కన్నీళ్ళకి బదులు దొరుకుతుందా? బాలిక మృతిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ చేయండి.