ప్రేమించకపోతే ఓ తంటా, ప్రేమిస్తే ఓ తంటాలా తయారయింది నేటి యువత తీరు. ప్రేమించేంత వరకు తమ ప్రేమను అంగీకరించాలని రకరకాల చర్యలకు దిగుతారు యువకులు. తీరా అమ్మాయి ప్రేమిస్తే.. ఇక వారికి నచ్చినట్లు ఉండాలంటూ ఆంక్షలు విధిస్తారు. తనకు నచ్చని పనిచేసిందా ఇక అంతే సంగతులు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. అటువంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
ప్రేమించమని వెంట పడటం, ప్రేమించలేదని అఘాయిత్యాలకు ఒడిగట్టడం నేటి యువత చేస్తున్న పిచ్చి పనులు. తీరా అమ్మాయి ప్రేమించాక.. పరాయి వ్యక్తులతో మాట్లాడకూడదని, పక్కనోళ్లను చూసి నవ్వద్దని, బయటకు వెళ్లరాదని, వాళ్ల బండి వీళ్ల బండి ఎక్కరాంటూ ఆంక్షల వలయంలో బంధిస్తారు. తండ్రి కంటే ఎక్కువగా కేరింగ్‌గా చూస్తున్నట్లు వాళ్లంతట వాళ్లే ఫీలయ్యి పోయి.. అనుమానాలతో ప్రేమించి వ్యక్తులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇటువంటి విషయాల్లోనే ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. అవి బ్రేకప్ చెప్పుకునే వరకు వెళుతుంటాయి. లేదంటే ఆత్మహత్యలు, హత్యల వరకు దారి తీస్తాయి. అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో చో్టుచేసుకుంది.
ప్రియురాలు మాట వినడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గుడివాడ పట్టణంలోని నైజం పేటలో బవర్ సింగ్ కుటుంబం నివసిస్తోంది. బవర్ సింగ్ మార్వాడీ గుడి సమీపంలో టీస్టాల్ నడుపుతున్నాడు. అతడి రెండో కుమారుడు శైలేష్ సింగ్ అదే పట్టణానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఇటీవల ఆ యువతి స్కూటీ కొనుక్కొని తిరుగుతుండటం శైలేష్ సింగ్‌కు నచ్చలేదు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పాడు. అతడి మాటలు పట్టించుకోని యువతి బైక్‌పై షికార్లు చేస్తుండటంతో శైలేష్ కోపంతో రగిలిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి ‘నువ్వు బైక్ పై తిరిగితే నేను చనిపోతా’ అంటూ బెదిరించాడు. నీ ఇష్టమోచ్చిందీ చేసుకో అని యువతి అనడంతో శైలేష్ మనస్థాపానికి గరయ్యాడు.
తాను ప్రేమించిన యువతి తన మాట లెక్క చేయక పోవడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడి అరుపులు విన్న స్థానికులు మంటలు ఆర్సి.. 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అతడ్ని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో అతడి నుండి న్యాయమూర్తి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రేమించిన యువతి బైక్ పై చక్కర్లు కొట్టడాన్ని భరించలేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.