మన ఇంట్లో జరిగిన తప్పుకు ఎదురింటి వారే కారణమని నిందిస్తూ వారిని శిక్షిస్తే ఎలా ఉంటుంది..? ఇదే జరిగింది బీహార్ లో. అకారణంగా ఓ మహిళను అత్యంత దారుణంగా, అమానవీయ రీతిలో దాడి చేసింది. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ తెలియదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు..
మహిళలు అకారణంగా వేధింపులకు గురౌతున్నారు. పుట్టిల్లు, మెట్టినిల్లే కాదు ప్రతి చోట వారికి అవహేళన, అవమానాలు ఎదురౌతున్నాయి. సమాజం చేసే వెర్రి పనులు, వెకిలి చేష్టలకు బలౌతున్నారు. తన జోక్యం లేకపోయినా, తన ప్రమేయం జొప్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, భర్త, అత్త, మామ వంటి వారు చేయి చేసుకోవడం గురించి విన్నాం కానీ, ఈ మహిళ పొరిగింటి వారి చేతిలో దెబ్బలు తిన్నదీ. ఓ చిన్న అనుమానంతో ఆమెను తీవ్రంగా హింసించారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు. ఆమెను శిక్షించే పేరుతో ఆమె పట్ల అమానవీయ రీతిలో వ్యవహరించిందో పొరిగింటి కుటుంబం. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే దర్భంగా జిల్లాలో జగదీష్ దాస్, గాంధీ దేవి కుటుంబం నివసిస్తోంది. వారిది ఇరుగు పొరుగు ఇళ్లు. అయితే జగదీష్ కూతరు కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అయితే ఆమె కనిపించకుండా పోవడానికి గాంధీ దేవి కారణమని భావించిన అతడి కుటుంబం ఆమెపై దాడికి పాల్పడింది. దేవీని నడి రోడ్డుపైకి తీసుకు వచ్చి అర్థ నగ్నంగా చేసి, కాళ్లు, చేతులు కట్టి దాడి చేశారు. తన కుమార్తె ఎక్కడికి వెళ్లిదంటూ ప్రశ్నించారు. తనకు ఏమీ తెలియదని చెప్పినప్పటికీ ఆమెను వదల్లేదు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అయినప్పటికీ వారి కోపం తీరకపోవడంతో మహిళ జుట్టును కూడా కత్తిరించారు. ఆమెను రక్షించేందుకు వచ్చిన కుమార్తెను కూడా కొట్టారు. ఈ ఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తీవ్రంగా గాయపడిన మహిళను కుటుంబ సభ్యులు ఆసుప్రతి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత బాధిత మహిళ దేవి.. గత నెల 27వ తేదీన జగదీష్‌తో పాటు 10 మందిపై కమతాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. బాధిత మహిళ న్యాయం కోసం సీనియర్ అధికారి కార్యాలయానికి వెళ్లింది. సీనియర్ అధికారిని కలిసి తనపై జరిగిన దారుణానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం చూపించింది. పరిశీలించిన సబ్ డివిజనల్ పోలీసు అధికార (ఎస్‌డిపిఓ) అమిత్ కుమార్ సంఘటన జరిగినట్లు ధ్రువీకరించారు. ఆమె జుట్టు కూడా కట్ చేసి ఉండటాన్ని పరిగణనలోనికి తీసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.