భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో చోటు చేసుకున్న దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్ రాఘవ వేధింపులు భరించలేక మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదం పరిష్కరానికి గాను ఏకంగా భాధితుడి భార్యను పణంగా పెట్టమన్న రాఘవ మాటలకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. తాను మరణించినా.. రాఘవ తన భార్య, పిల్లలను వదలడని భావించిన రామకృష్ణ కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక చనిపోయే ముందు రాఘవ అరాచకాలను వివరిస్తూ.. తీసిన సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై విపక్షాలు, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇక రామకృష్ణ మృతి అనంతరం రాఘవ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కావడంతో రాఘవ అరాచకాలకు అంతూ లేకుండా పోయిందని తెలుస్తోంది. తన నియోజకవర్గంలో ఏ అధికారులు పని చేయాలన్నది అతడే నిర్ణయిస్తాడని.. రాఘవ ఆశీస్సులు లేకపోతే పోస్టింగులు దక్కవనే భయంతో.. పోలీసులు కూడా అతడు చెప్పినట్లు వింటారని స్థానికులు వెల్లడించారు. అధికారులు ఇలా అంటి ముట్టనట్లు ఉండటం వల్లే నాలుగు నిండు ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విలన్ కు ఏమాత్రం తగ్గని రాఘవ
సినిమాల్లో విలన్ లు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో.. రియల్ గా రాఘవ వారిని మించి పోయాడు. గత మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం కేంద్రంగా రాఘవ సాగిస్తున్న ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. ఆయన వేలు పెట్టని వివాదమే లేదంటే అతిశయోక్తి కాదు. అధికారుల అండ చూసుకుని రాఘవ రెచ్చిపోయేవాడు. అధికారికంగా అతడిపై ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. కానీ వెలుగు చూడని దారుణాలు చాలా ఉన్నాయి అంటారు.
నాటి నుంచే ఆగడాలు..
రాఘవపై 2006లో అధికారికంగా మొదట కేసు నమోదైంది. అంతకు దాదాపు దశాబ్దంన్నర ముందు నుంచే అతని ఆగడాలు మొదలయ్యాయి.
2006లో పాలకోయ తండాలో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది. వాటిని తొలగించేందుకు రెవెన్యూ, పురపాలక అధికారులు వెళ్లారు. అక్కడకు వచ్చిన రాఘవ వారితో దురుసుగా ప్రవర్తించడంతో తొలి కేసు నమోదైంది. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది.
2013లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు పంపిణీపై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆపినా పట్టించుకోకుండా వాహనంలో దూసుకెళ్లారు. ఇదే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తుండగా అడ్డుకోబోయిన ప్రభుత్వ ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించాడు. ఈ దౌర్జన్యంపై మరో కేసు నమోదు కాగా న్యాయస్థానంలో విచారణ తర్వాత కొట్టేశారు.
2017లో ఓ ధర్నా సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసు ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది.
2020లో పాల్వంచ సోనియానగర్‌లో భూక్యా జ్యోతి అనే మహిళకు చెందిన భూ వివాదంలో ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకోవడం రచ్చకు దారితీసింది. జ్యోతిపై అతడి అనుచరులు దాడిచేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలు మంత్రి సత్యవతి రాథోడ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా పోలీసులు దిగొచ్చి కేసు నమోదు చేయక తప్పలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
వడ్డీ వ్యాపారి ఆత్మహత్య
2021 జులైలో పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు రూ. 50 లక్షలకు చిట్టీ పాడారు. నిర్వాహకుడు డబ్బుకు బదులు స్థానిక బొల్లోజుగూడెంలో ప్లాటును రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరో వ్యక్తికీ రాసివ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలున్నాయి. జైలుకెళ్లిన వెంకటేశ్వర్లు బయటకు వచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమా కుమారుడేనని లేఖ రాశాడు.
రాఘవను నేనే పోలీసులకు అప్పగిస్తాను: వనమా వెంకటేశ్వరావు
రామకృష్ణ ఆత్మహత్య ఉదంతం దిగ్భ్రాంతికి గురిచేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ‘బాధితుడు రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో నన్నెంతో కలచివేసింది. ఆయన నా కుమారుడిపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులన్నింటిలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేంత వరకు నా కుమారుడిని నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఓ ఎమ్మెల్యేగా, బాధ్యతగల తండ్రిగా నిర్ణయించాను. పోలీసులు, న్యాయ వ్యవస్థకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తా. నేనే రాఘవేంద్రరావును పోలీసులకు అప్పగిస్తాను. అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేనెప్పుడూ ఏ వ్యవస్థనూ ప్రభావితం చేయలేదు’ అని నియోజకవర్గ ప్రజలకు ఓ బహిరంగ లేఖలో తెలిపారు.
పోలీసుల అదుపులో రాఘవ!
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా కేసు నమోదైన వనమా రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు స్వయంగా పోలీసులకు అతడిని అప్పగించినట్లు తెలిసింది. గురువారం రాత్రి కొత్తగూడెం తీసుకొచ్చి శుక్రవారం ఉదయాన్నే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇంకా దొరకలేదన్న ఏఎస్పీ..
రాఘవేంద్రరావు ఇంకా తమకు దొరకలేదని గురువారం రాత్రి ఏఎస్పీ రోహిత్‌రాజ్ విలేకరులకు చెప్పారు. అతని కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతడిపై అభియోగాలకు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి : పాల్వంచ ఘటనలో భారీ ట్విస్ట్! వనమా రాఘవ అరెస్ట్ కి రేవంత్ రెడ్డి డిమాండ్!