ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనద్దు అని చిరంజీవి ఠాగూర్ సినిమాలో అంత వివరంగా చెప్పినా కూడా కొంతమంది లంచాలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళు తిరగబడకుండా లంచాలు అలవాటు చేయడం వల్లే ప్రభుత్వ అధికారులు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ట్రాఫిక్ లో, బస్టాండ్ లో బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ళు నయం అని అంటారు. వాళ్ళు పని చేయడానికి శరీరం సహకరించకపోయినా మండుటెండలో నిలబడి డబ్బులు అడుగుతారు. ఇస్తే తీసుకుంటారు, లేదంటే వెళ్ళిపోతారు. కానీ మన ఆదాయం లోంచి కొంత డబ్బు తీసి కడుతున్న పన్నుల నుంచి జీతం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కొందరు సామాన్యుల పాలిట కుంపటిగా మారుతున్నారు.
ప్రజలకు సేవ చేయడమే వాళ్ళ వృత్తి అయితే.. ఆ సేవకు లంచం ఇవ్వమని అడుగుతున్నారు. ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. అంటే ప్రజలే వారికి జీతాలు ఇస్తున్నారు. అంటే ప్రజల నౌకర్లు వాళ్ళు. అలాంటిది యజమానుల్లా, బ్రిటిష్ పాలకుల్లా ఫీలవుతూ సామాన్యులను, పేదలను లంచాల పేరుతో దోచుకుంటున్నారు. అదేంటో ప్రభుత్వ ఉద్యోగం రావడం కోసం ఎంతగానో కష్టపడి చదువుతారు. గ్రూప్-1, గ్రూప్-2 అని పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షల కోసం ఎంతకాలం నుంచో ప్రిపేర్ అవుతారు. పరీక్ష ఫెయిలైతే చాలా నిరుత్సాహపడతారు. మళ్ళీ చదివి మళ్ళీ రాస్తారు. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. అదేంటో అప్పటి వరకూ ‘ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు ఈ జీవితానికి’ అన్నట్టు బతికిన వారు ఉన్నట్టుండి ఉద్యోగం రాగానే మారిపోతారు.
ప్రభుత్వ ఉద్యోగం రాకముందు వరకూ సిన్సియర్ గా ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగం రాగానే నీతి, నిజాయితీలను చెత్తబుట్టలో పడేస్తారు. ఇలా అందరూ ఉండరు కానీ కొందరు ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదు గానీ లంచం కోసం చేతులు చాచుతారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న నిర్మల తనకొచ్చిన జీతం సరిపోక సామాన్యులను లంచాలు డిమాండ్ చేసింది. పూదరి శ్రీనివాస్ డాక్యుమెంట్స్ కోసం పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా.. అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో పూదరి శ్రీనివాస్ దేవనగరి నిర్మలకు భారీగా డబ్బులు చెల్లించాడు. కానీ అధికారులు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇంకా లంచం కావాలని డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ బాధితుడి నుంచి రూ. 60 వేలు తీసుకుంటుండగా రిజిస్ట్రార్ నిర్మల, అటెండర్ శ్రీనివాస్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.