ఎలాన్ మస్క్.. ఈ పేరు గురించి ప్రపంచ దేశాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అతను సాధించిన విజయాలు చూస్తే.. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి వాహన పరిశ్రమలోనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాడు. అంతటి స్మార్ట్ మైండ్ దృష్టి తాజాగా స్మార్ట్ ఫోన్ లపై పడింది. ఈ భూమి మీదే కాకుండా అటు అంతరిక్షం నుంచి.. వేరే గ్రహాల(మార్స్) నుండి సైతం ‘హలో’ అంటూ మాట్లాడుకునే స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎలాన్ మస్క్ ఏది చేసినా ‘గ్రాండ్’ గానే ఉంటుంది. అందుకు ఉదాహరణే టెస్లా కార్స్, స్పేస్ ఎక్స్ మిషన్. అందుకే ఇకపై స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో అద్భుతాలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎలాన్ మస్క్ ఆవిష్కరించనున్న టెస్లా స్మార్ట్ ఫోన్ కి ‘ఫై'(Pi) అనే పేరు ఫిక్స్ చేశారు. అయితే.. ప్రస్తుతం ఫై స్మార్ట్ ఫోన్ ఫీచర్దాస్ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. అందులో ముఖ్యంగా ‘స్టార్ లింక్’ సదుపాయం. ‘పై’ ఫోన్ లో స్టార్ లింక్ టెక్నాలజీని పొందుపరచనున్నారట. ఈ ఫోన్ ద్వారా అంతరిక్షంలో ఏ గ్రహానికి వెళ్లినా భూమి మీద మాట్లాడవచ్చు.‘మార్స్ కాయిన్’ అనే క్రిప్టో కరెన్సీని ఈ ఫోన్ తో మైనింగ్ చేయాలనేది ఆలోచనగా చెబుతున్నారు. మానవ మెదడుని స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసే బ్రెయిన్ – ఫోన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ ఈ ఫై ఫోన్ లో ఉంటుంది. దీనిని శాటిలైట్ ఫోన్ లా కూడా వాడుకోవచ్చు. శాటిలైట్ ఫోన్లలో ‘తురాయ’, ఇరిడియమ్’ అనేవి ఇప్పటికే వచ్చేశాయి. కానీ వీటి ఖరీదు చాలా ఎక్కువ. అయితే.. టెస్లా శాటిలైట్ ఫోన్ అందరికి అందుబాటులో లభించేదిగా ఉండాలనేది ఎలాన్ ప్లాన్ అని టాక్.
ఈ ఫై ఫోన్ సౌరశక్తి(కాసేపు ఎండలో పెడితే)తో కూడా ఛార్జ్ అవుతుంది. ఫోన్ వెనుక ప్యానెల్ మీద ప్రత్యేక ‘కోటింగ్’ కలిగి.. ఎప్పటికప్పుడు పరిసరాల దృష్ట్యా ఫోన్ రంగు మారుతుందట. ప్రస్తుతం సమాచారం ప్రకారం.. టెస్లా పై స్మార్ట్ ఫోన్ ధర 800 – 1200 డాలర్లు(సుమారు రూ.60,000 – 90,000)గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్స్ కూడా ఇదే స్థాయి ధరలు కలిగి ఉంటాయి. కాబట్టి టెస్లా ఫోన్ త్వరలో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలకు గట్టి పోటీగా నిలవనుందని అంటున్నారు. కానీ ఇంతవరకూ ‘పై’ స్మార్ట్ ఫోన్ పై టెస్లా నుండి, ఎలాన్ మస్క్ నుండి ఎలాంటి ప్రకటనలు రాకపోవడం గమనార్హం. మరి ఈ టెస్లా ఫై స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.