కరోనా.. ఎందరో జీవితాలను రోడ్డున పడేసింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఇలా చేయడం లేదు.. బడా కంపెనీలు, ఎంఎన్‌సీలు సైతం.. ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫేస్‌బుక్ ఈ జాబితాలోకి చేరింది. కంపెనీ చరిత్రలో మొదటి సారిగా భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 12 వేల మందిని తీసివేయనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం.. సరైన సామార్ధ్యం కనబరచకపోవడమే అని తెలుస్తుంది. ఈ క్రమంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఈ మధ్యే మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్టాఫ్‌తో ప్రశ్న జవాబుల సెషన్ నిర్వహించినట్లు సమాచారం. మెటా ఎర్నింగ్స్ కాల్స్‌లో ఈ అంశంపై తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఇప్పటికే ఫేస్‌బుక్ మే నుంచి ఉద్యోగుల హైరింగ్ ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీన్ని మరికొంత కాలం పొడగించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే హైరింగ్ ప్రక్రియ నిలిపివేతతో పాటు ఖర్చులు తగ్గించుకునేందుకు 15 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయినట్లు జుకర్ బర్గ్ తేల్చి చెప్పారు.
కంపెనీ ఆశించిన సామార్థ్యం ప్రదర్శించని 15 శాతం మంది ఉద్యోగులపై వేటు తప్పదని.. నివేదికలు వచ్చినట్లు సమాచారం. అంటే దాదాపుగా 12,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని సమాచారం. టెక్ ఉద్యోగులు ఉపయోగించే బ్లైండ్ యాప్‌లో మెటాలో పనిచేసే ఓ వ్యక్తి ఉద్యోగ కోతల గురించి పోస్టు చేశారు. కంపెనీల మెయిల్ ఐడీలు ఉన్న వారిని మాత్రమే ఇందులో పోస్టు చేసేందుకు అనుమతిస్తారు. ‘ఈ 15 శాతం మందిని పిప్స్ (పెర్ఫామెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్) విభాగంలో ఉంచారు’ అని మరొకరు పోస్టు చేశారు.
ఫేస్‌బుక్ ఎంప్లాయీ రివ్యూ ప్రాసెస్ ప్రకారం ‘ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్’ విభాగంలో ఉంచిన వారు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం లేదని అర్థం. అలాంటి వారినే పిప్స్ కేటగిరీలో ఉంచి.. ఉద్యోగం నుంచి తొలగించి బయటకు పంపించేస్తారు. తాజా రీస్ట్రక్చర్‌తో సుమారు 12 వేల మంది ఈ విభాగంలోకి వస్తున్నారట. 30 రోజుల్లో వీరు కంపెనీలో కొత్త పొజిషన్ వెతుక్కోవాలి.. లేదా బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తుతుండటంతో మెటా నియామక ప్రక్రియను నిలిపివేసింది. ఉన్న ఉద్యోగులనే ఇతర విభాగాలనూ సర్దుతోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఇతర టెక్ సంస్థలూ ఇదే దారిలో నడుస్తున్నాయి.