గత కొంతకాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. కానీ, రానున్న కాలంలో సామాన్యుడిపై మళ్లీ పెట్రో బాదుడు తప్పేలా లేదంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఇంధన ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలపై భారం పడక తప్పదు అంటూ నిపుణులు భావిస్తున్నారు.
ముడి చమురు ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత నాలుగు వారాల వ్యవధిలోనే బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 25 శాతం మేర పెరిగిపోయింది. డిసెంబరు 1న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 88 డాలర్లు దాటిపోయింది. మరికొన్ని రోజుల్లో 100 డాలర్లు కూడా పలుకుతుందని భావిస్తున్నారు. రష్యా- యూఏఈ మధ్య ఉద్రిక్తతలు, ఇరాక్ నుంచి టర్కీ వెళ్లే ముడి చమురు పైపు లైనులో సాంకేతిక సమస్యలు.. వెరసి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కు రెక్కలు వచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయంటున్నారు.