టెక్నాలజీ పరంగా వాహన రంగంలో ఏదైనా కొత్త వెహికల్ లాంఛ్ అయిందంటే.. అందరి చూపు దానిపైనే ఉంటుంది. అలాగే కొంతకాలం ఆ కొత్త వెహికల్ గురించే మాట్లాడుకుంటారు. అలా మార్కెట్ లోకి వచ్చిన మోడల్స్ కొంతకాలం తర్వాత పాతబడి పోతుంటాయి. కానీ లాంఛ్ అయిన తక్కువ కాలానికే వెహికల్ తయారీ ఆగిపోవడం అనేది కొంచం షాకింగ్ విషయమనే చెప్పాలి. తాజాగా ఓలా కస్టమర్లకి అలాంటి కబురే వినిపించింది. ఓలా తమ ఎస్1(Ola S1) వెహికల్స్ తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
మరి తయారీని ఎందుకు నిలిపివేస్తున్నారో తెలుపుతూ కొన్ని కారణాలు మెయిల్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. మళ్లీ కొత్తగా ఓలా ఎస్1 వెహికల్స్ తయారు చేసేవరకు వినియోగదారులు ఎదురు చూడకతప్పదని తెలుస్తుంది. అంతవరకు ఓలా S1 Pro అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. చాలాకాలం తర్వాత ఓలా గత డిసెంబర్ నెలలో కస్టమర్లకు ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్ లను డెలివరీ చేసింది. కానీ కంపెనీ సాఫ్ట్‌వేర్ మాత్రం కస్టమర్లు ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి.
ముఖ్యంగా S1 బైక్ డ్రైవింగ్ సమయంలో వాహనదారులు అసహననానికి గురయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. క్రూయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్, నేవిగేషన్ అసిస్ట్, హైపర్ మోడ్ లలో సాఫ్ట్‌వేర్ లోపాలు తలెత్తడంతో ఓలా పై ఫిర్యాదులు తలెత్తాయట. ఇంకా స్కూటర్ ఛార్జింగ్, మైలేజ్ కంపెనీ చెప్పినట్లుగా లేవని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. ఇక అన్ని విమర్శలను గమనించిన ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్.. ఎస్1 వెహికల్స్ సాంకేతిక సమస్యల్ని పరిష్కరిస్తామని, కస్టమర్లకు క్షమాపణలు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.