కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుతో సామాన్యులకు షాకులు మీద షాకులు ఇస్తూ వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై 50 మేర పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోల్, వంట నూనెల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. లీటర్ నూనె 200 రూపాయలకు పైగా పలికింది. ప్రస్తుతం కూడా 190-200 రూపాయల ధర ఉంది. ఈ క్రమంలో గత కొంత కాలం నుంచి త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు దిగిరావడం, కేంద్ర ప్రభుత్వం ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చలు జరపడం వల్ల వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఓ కంపెనీ వంట నూనె ధర లీటర్‌కు 14 రూపాయల మేర తగ్గించింది. ఆ వివరాలు..
మదర్ డెయిరీ వంట నూనె ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్ ధర లీటరుకు రూ. 14 మేర తగ్గించింది. కాగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మదర్ డెయిరీ అనేది అతిపెద్ద పాల సరఫరా కంపెనీ. ఈ సంస్థ అలాగే వంట నూనెలను కూడా విక్రయిస్తుంది. ధారా బ్రాండ్ కింద వంట నూనెలను అమ్ముతోంది. ప్రస్తుతం ధర తగ్గింపు సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్‌కు మాత్రమే వర్తిస్తుంది. అయితే మదర్ డెయిరీ కంపెనీ త్వరలోనే సన్ ఫ్లవర్ ఆయిల్ రేటును కూడా తగ్గించొచ్చని తెలుస్తోంది. వచ్చే 15 నుంచి 20 రోజుల్లోగా సన్ ఫ్లవర్ ఆయిల్ రేటు తగ్గొచ్చు. కాగా ఈ కంపెనీ జూన్ 16న కూడా వంట నూనె రేట్లను లీటరుకు రూ. 15 మేర తగ్గించింది.
ఇది కూడా చదవండి: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
కాగా కేంద్ర ప్రభుత్వంతో బుధవారం నాటి చర్చల అనంతరం తొలిగా వంట నూనె ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ పతంజలి. పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వంట నూనె ధరలు త్వరలోనే తగ్గిస్తామన్నారు. లీటరుకు రూ. 10 నుంచి రూ. 15 మేర తగ్గింపు ఉంటుందని తెలిపారు. వచ్చే 2 – 3 వారాల్లో రేట్ల తగ్గింపు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ నుంచి చూస్తే పామ్ ఆయిల్ ధరను లీటరుకు రూ. 20 మేర తగ్గించామని గుర్తు చేశారు. అలాగే సోయాబీన్ ఆయిల్ రేటు లీటరుకు రూ. 20, సన్ ఫ్లవర్ ఆయిల్ రేటు లీటరుకు రూ. 25 మేర తగ్గించామని తెలిపారు. ఇక మిగతా కంపెనీలు కూడా ధరలు తగ్గిస్తే మంచిది అంటున్నారు జనాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దేశంలో పెట్రో ధరల మంట! బంకుల మూసివేత దిశగా కంపెనీలు..!