సామాన్యులకు ఊరట లభించింది. వంట నూనె ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు దిగి రావడం, ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరడం వంటి కారణాల వల్ల వంట నూనె ధరలు తగ్గాయి.
కరోనా ముందు ఏ వంట నూనె కొనుగోలు చేసినా లీటరు రూ. 100 లోపే ఉండేది. కానీ కరోనా సమయంలో ఆ ధరలకు రెక్కలు వచ్చాయి. పామాయిల్ నూనె లీటర్ రూ. 170 కాగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 190కి పెరిగింది. కరోనా తర్వాత తగ్గుతాయి కదా అనుకుంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో మళ్ళీ పెరిగాయి. దీంతో వంట నూనె ధరలు లీటరు రూ. 200కి చేరుకున్నాయి. ఈ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని గత ఏడాది, ఈ ఏడాది రెండు సార్లు తగ్గించింది. దీనికి తోడు అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ లో ఉన్న ప్రముఖ మదర్ డెయిరీ కంపెనీకి చెందిన ధార బ్రాండ్ కింద విక్రయించే వంట నూనె ధరలను తగ్గించింది.
గరిష్ట రిటైల్ ధరని (ఎంఆర్పీని) లీటరు మీద రూ. 10 తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ఎంఆర్పీ ధరలు తగ్గాయని కంపెనీ వెల్లడించింది. ధార కంపెనీ విక్రయించే అన్ని రకాల వంటనూనెల ధరలను రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ధార శుద్ధి చేసిన సోయాబీన్ నూనె లీటరు రూ. 140 కాగా.. ధార రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్ లీటరుకు రూ. 160 తగ్గించారు. ధార రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ. 150 కాగా, ధార వేరుశనగ నూనె లీటరు రూ. 230 అయ్యింది. ప్రధానమైన వంట నూనెల ఎంఆర్పీ ధరలను లీటరుకు రూ. 8 నుంచి రూ. 12 తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వంట నూనె పరిశ్రమలకు గత వారం కేంద్రం ఆదేశించింది. వెంటనే ధరలు అమలులోకి వచ్చేలా చూడాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ వంట నూనె ధరలు టన్నుకు 150 నుంచి 200 డాలర్ల మేర తగ్గాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా వ్యాపారులు వంట నూనె ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంది. స్టాంప్ డ్యూటీ తగ్గింపుతో వంట నూనె ధరలు అందుబాటులోకి వచ్చాయి. సన్ ఫ్లవర్, సోయాబీన్, రైస్ బ్రాన్, పామాయిల్ నూనె ధరలు తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది. ఆరు నెలల క్రితం రూ. 200 పలికిన లీటర్ నూనె ప్రస్తుతం రూ. 115 నుంచి 120 మధ్య పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వంట నూనె ధరలు పెరగకుండా తరచూ మిల్లుల్లో తనిఖీలు చేపట్టడం, కల్తీ జరగకుండా చర్యలు తీసుకుంటుండడంతో ఆయిల్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.
గతంతో పోలిస్తే లీటరుపై వంట నూనె ధరలు రూ. 70 నుంచి రూ. 80 తగ్గాయి. అంతకు ముందు ఏ రకం వంట నూనె కొనాలన్నా రూ. 170 నుంచి రూ. 200 ఉండేది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సంతల్లో వంట నూనెలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం వంట నూనె ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు సంతల్లో బయట మార్కెట్ తో పోల్చుకుంటే ధరలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు తగ్గాయని గిరిజనులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చునని అంటున్నారు.