సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తినే నూనెల ధరల విషయంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట నూనె ధరల విషయంలో ప్రజలకు ఊరట దక్కనుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌కు అనుగుణంగా వంట నూనెల ధరలను వెంటనే తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లను కేంద్ర సర్కారు ఆదేశించింది. వంట నూనెల గరిష్ట రిటైల్ ధరల్ని లీటర్‌కు రూ.8 నుంచి రూ.12 వరకు తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో పాటు ఇండస్ట్రీ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. సంజీవ్ చోప్రా నిర్వహించిన సమావేశం తర్వాత కీలక విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. వంట నూనెల తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే రేట్స్ కూడా వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
మన దేశంలో తినే నూనెల కోసం ప్రజలు తక్కువ ఖర్చు చేయాలని కోరుకుంటారు. అయితే రేట్లు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఈ మధ్య క్రమంగా దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయని ఆహార మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కాగా, గత కొంత కాలంగా ఆయిల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం విదితమే. ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా తగ్గనుండటం సామాన్యులకు భారీ ఊరటను ఇచ్చే అంశమే. కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గడం అనేది పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్తగా చెప్పొచ్చు. ఇకపోతే, గతేడాదిలో వంట నూనె ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. పామాయిల్ రేట్లు అయితే ఏకంగా కిలో రూ.160కి పైకి చేరింది. ధరల పెరుగుదలతో సామాన్యులపై అప్పట్లో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.