లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ. ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థ. 1956 లో ఎల్ఐసీని జాతీయం చేశారు. దశాబ్దాల కాలం పాటు ఇది భారతీయ ఏకైక బీమా సంస్థగా వెలుగొందింది. 2000 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. అయినప్పటికీ భారత్‌లో అతిపెద్ద బీమా కంపెనీగా ఎల్‌ఐసీ నిలిచింది. బీమా రంగంలో ఎల్‌ఐసీ వాటా 75 శాతం. ప్రభుత్వ ముసాయిదా, డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వాల్యూ 71.56 బిలియన్ డాలర్లు.
భారత ప్రభుత్వానికి ఎల్‌ఐసీలో 100 శాతం వాటా ఉంది. అంటే 100 శాతం షేర్లు భారత ప్రభుత్వానివే. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఎఎం) సంస్థ సెబీకి సమర్పించిన నివేదిక ప్రకారం, ఎల్‌ఐసీలోని 5 శాతం షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. అంటే 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ షేర్ల ద్వారా రూ. 63 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 10 శాతం షేర్లను బీమా చేసిన వారి కోసం రిజర్వ్ చేయనున్నట్లు నివేదికలోలో పేర్కొన్నారు. పది శాతం షేర్లను 29 కోట్ల మంది పాలసీ హోల్డర్ల కోసం కేటాయించారు. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాకే చేరుతుంది. ఆ ఆదాయంలో ఎల్‌ఐసీకి వచ్చేదేమీ ఉండకపోవచ్చు.
పాలసీ హోల్డర్లకు ఐపీవో ఆఫర్లు
ఎల్‌ఐసీ మెగా ఐపీవోలో పెట్టుబడి పెట్టేందుకు సంస్థ తమ పాలసీ హోల్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఐపీవోలో జారీచేసే షేర్లలో 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్టు ఎల్‌ఐసీ సెబీకి సమర్పించిన నివేదికలో తెలిపింది. ఐపీవో ద్వారా ప్రభుత్వం దాదాపు 31 కోట్ల షేర్లను విక్రయించవచ్చని భావిస్తున్నారు. ఇందులో 10 శాతం.. అంటే 3 కోట్ల షేర్లు పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేయవచ్చని అంచనా. ఒక షేరు ధర రూ. 4.7గా నిర్ధారించినప్పటికీ.. ఇష్యూ ధరలో కొంత డిస్కౌంట్‌ను కూడా పాలసీ హోల్డర్లకు ఎల్‌ఐసీ ఇవ్వనుంది. ఇష్యూ ధర ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ క్యాటగిరిలో దరఖాస్తు చేసిన అర్హులైన పాలసీ హోల్డర్లకు..డిస్కౌంట్ తర్వాత రూ. 2 లక్షల విలువకు మించకుండా షేర్లను కేటాయించనున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది.
ఐపీవోకు దరఖాస్తు చేయదల్చిన ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లు ఈ నెల 28 కల్లా పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వివరాల్ని వారి పాలసీ రికార్డులో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ లో పాలసీ హోల్డర్లకు 10 శాతం షేర్లను ఎల్‌ఐసీ రిజర్వ్ చేసింది. ఇష్యూ ధర ఖరారు కానప్పటికీ.. ఇష్యూ ధరలో కొంతమేర డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెబీకి ఆఫర్ డాక్యుమెంట్ నివేదించిన తేదీ (ఫిబ్రవరి 13) నుంచి రెండు వారాల్లోగా (ఫిబ్రవరి 28) పాలసీ హోల్డర్లు వారి పాన్ వివరాల్ని సంస్థ రికార్డుల్లో అప్‌డేట్ చేయాలని, లేకపోతే పాలసీ హోల్డర్‌కు రిజర్వ్‌చేసిన విభాగంలో షేర్లకు దరఖాస్తు చేసే అర్హత కోల్పోతారని ఎల్‌ఐసీ సంస్థ తెలిపింది.