మంచి రాబడి, కుటుంబ భద్రతకు సరిపోయేలా మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ కథనం మీకోసమే. ఒక్కసారి ఈ పాలసీ తీసుకుంటే.. మీ కుటుంబానికి భద్రత ఉంటుంది. డెత్ బెనిఫిట్, గ్యారంటీ అడిషన్స్, మెచ్యూరిటీ బెనిఫిట్ అంటూ భారీ మొత్తం మీ చేతికి అందుతాయి.
దేశీయ అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పాలసీలు, పథకాలు అందరికీ విదితమే. రిస్క్ లేని ఖచ్చితమైన రాబడి పొందాలని ఆలోచించే వారికి ఎల్ఐసీ పాలసీలు అద్భుతమైనవని చెప్పాలి. దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసీ కొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిందే.. ఎల్ఐసీ బీమా రత్న పాలసీ. ఈ పాలసీ ద్వారా మొత్తం 3 ప్రయోజనాలు పొందవచ్చు. అందుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుందని అవుతుందనిపిస్తే.. ఇందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
ఎల్ఐసీ బీమా రత్న అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపునకు సంబంధించిన జీవిత బీమా ప్లాన్. ఇంకా చెప్పాలంటే.. మనీ బ్యాక్ పాలసీ. ఇందులో కచ్చితమైన బోనస్ లభిస్తుంది. 90 రోజుల నుంచి 55 ఏళ్ల వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్ధతుల్లో చెల్లించవచ్చు. ఈ పాలసీని 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల టెన్యూర్‌తో తీసుకోవచ్చు. ఎంచుకున్న టెన్యూర్ కంటే నాలుగేళ్లు తక్కువగా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఎంచుకుంటే 11 ఏళ్లు ప్రీమియం కట్టాలి. అదే 20 ఏళ్ల టెన్యూర్ కి అయితే.. 16 ఏళ్లు, 25 టెన్యూర్ కి అయితే.. 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. కనీసం రూ.5 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి అంటూ లేదు.
ఈ పాలసీ ద్వారా – మనీ బ్యాక్, గ్యారెంటెడ్ బోనస్, డెత్ బెనిఫిట్ వంటి మూడు ప్రయోజనాలు పొందుతారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ. 10 లక్షల అస్యూర్డ్ అమౌంట్ తో 20 ఏళ్ల కాలవ్యవధికి పాలసీ తీసుకున్నాడనుకుందాం.. అప్పుడు అతడు ఏడాదికి రూ. 50 వేలు లేదా రోజుకు 138 రూపాయలు చొప్పున 16 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి సర్వైవల్ బెనిఫిట్ కింద 18వ ఏడాది, 19వ ఏడాదిలో రూ.2.5 లక్షల చొప్పున చేతికి అందుతాయి. అలాగే 20 ఏళ్ల టెన్యూర్ గడిచాక.. గ్యారంటీ అడిషన్స్, మెచ్యూరిటీ బెనిఫిట్ కింద భారీ మొత్తం మీ చేతికి అందుతాయి. ఒకవేళ పాలసీదారడు అర్ధాంతరంగా పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే, నామినీకి హామీ ఇవ్వబడిన హామీ మొత్తం మరియు బోనస్ ఇవ్వబడుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. సంప్రదాయ బీమా పాలసీల్లో వచ్చే రాబడి కొద్దిగా తక్కువగా కూడా ఉండవచ్చు. కావున ఏదేని పాలసీని కొనే ముందు ఆ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవడం లేదా ఎల్‌ఐసీ సిబ్బందిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.