బంగారం అంటే భారతీయ మహిళలు పడి చచ్చిపోతారు. ఒంటిమీద ఎంత బంగారం ఉంటే.. అంత ఐశ్వర్యవంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే.. వివాహం వంటి శుభకార్యల వేళ.. ఆడపిల్లల కోసం ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. భారతీయుల దృష్టిలో బంగారం అంటే.. కేవలం ఆభరణంగా మాత్రమే కాక.. ఆస్తిగా కూడా భావిస్తారు. పెట్టుబడులు పెట్టేవారు.. బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అయితే గత కొన్నేళ్లుగా బంగారం రేటు.. విపరీతంగా పెరుగుతుంది. 10-15 సంవత్సరాల క్రితం తులం బంగారం రేటు 10 వేల రూపాయల వరకు ఉండగా.. ఇప్పుడు తులం 50 వేల రూపాయలు పలుకుతుంది. అయితే ఈ ఏడాది బంగారం ధర ఎలా ఉండబోతుంది.. అసలు ఈ ఏడాది బంగారం కొనవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం.
మన దగ్గర పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ.. బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత ఏడాది దసరా, దీపావళి పండుగ వేళ.. బంగారం, వెండి ధర భారీగా పడిపోయింది. దాంతో గిరాకీ పెరిగి.. రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. అయితే రెండు నెలల్లోనే పరిస్థితి తారుమారయ్యింది. ప్రస్తుతం బంగారం రేట.. భారీగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు.. ఔన్సుకు 1824.30 డాలర్లకు పెరిగింది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక రేటు కావడం విశేషం. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.98 డాలర్ల వద్ద ఉంది.
ఇక మన దేశంలో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.50,600 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఈ మధ్యలో 22 క్యారెట్ల బంగారం ధర.. ఇలా 50 వేల మార్కు దాటడం కూడా ఇదే తొలిసారి. గత 10 రోజుల్లో చూసుకుంటే.. బంగారు రేట్లు.. ఏకంగా 5 సార్లు పెరగ్గా.. రెండు సార్లు మాత్రమే స్వల్పంగా తగ్గాయి.
అయితే 2023లోనూ బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి.. రికార్డు స్థాయి ధరలు పలుకుతాయని.. మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదల సహా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధర.. తులం రూ.62 వేల మార్కుకు, సిల్వర్ రేటు కిలో.. రూ.80 వేల మార్కుకు చేరతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక ఈ ఏడాది బంగారం కొనాలనే ఆలోచన ఉన్న వారు.. ఇప్పుడే కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.