చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులోనూ చవకగా ఇంటర్నెట్ డేటా.. ఇంకేముంది అందరికి సోషల్ మీడియాలోనే కాలక్షేపం. ఇదే ఇప్పటి కాలం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు జనాలు. అయితే దీని వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం లేని సమయంలో ఏదైనా ఓ వార్త జనాలకు చేరాలంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దీంతో పుకార్లు కూడా త్వరగానే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కున్నారు. ట్విట్టర్ ఆయనపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ కు పోటీగా ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ తీసుకొచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయిన తర్వాత 2021 జనవరిలో అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి జరిగింది. తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంతోనే ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్.. ట్రంప్‌ను నిషేధించాయి. అనంతరం సోషల్ మీడియా సంస్థలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తానే స్వయంగా సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెక్ దిగ్గజ సంస్థల దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొనేందుకు సొంత యాప్ తో ముందుకు వస్తానని వెల్లడించారు.డొనాల్డ్ ట్రంప్ అలా ప్రకటించారో..లేదో.. కేవలం నాలుగు నెలల్లోనే ట్రంప్ సోషల్ మీడియా యాప్ రెడీ అయ్యింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న సోషల్ మీడియా సంస్థలకు పోటీగా ‘ట్రూత్ సోషల్ ‘ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ ఫిబ్రవరి 21న అందుబాటులోకి వచ్చింది. వీటికి సంబంధించి ‘టైం ఫర్ సమ్ ట్రూత్ అంటూ మాజీ అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఇది యాపిల్ కు చెందిన చెందిన యాప్ స్టోర్లలోనే అందుబాటులో ఉండనుంది. మరి కొద్దీ రోజుల్లో అందరకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
‘ట్రూత్ యాప్’ ను రిపబ్లికన్ మాజీ ప్రతినిధి డేవిస్ న్యూన్స్ ఆధ్వర్యంలోని ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (IMTG) రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించి బీటా వెర్షన్ టెస్టింగ్ కూడా పూర్తయ్యింది. ట్విట్టర్ ను పోలి ఉండే ఈ యాప్ లో ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. ట్రెండింగ్ లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ట్విటర్లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటాం. ట్రూత్ సోషల్ యాప్ లో పోస్ట్ చేసేవాటిని ‘ట్రూత్’ అని పిలుస్తారట.