బిగ్ బాస్ 6వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 14 వారాలు గడిచిపోయాయి. తాజాగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఇనయ ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశాడు. దీంతో టాప్-5 ఎవరెవరు ఉండబోతున్నారా అనే టెన్షన్ అందరిలో ఉంది. ఇలాంటి టైంలో హౌసులో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎమోషనల్ చేస్తున్నాడు. ఏకంగా ఏడిపించేస్తున్నాడు. తాజాగా శ్రీసత్యకు అలా కొన్ని విషయాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఐదు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లు ఎవరనేది తెలియకపోవడం, గేమ్స్ లోనూ కొత్తదనం లేకపోవడంతో టీఆర్పీ రేటింగ్స్ చాలా వరకు తగ్గినట్లు గణాంకాలు బయటకొచ్చాయి! ఇప్పటివరకు గొడవలు, లవ్వులు లాంటి వాటితో ఎపిసోడ్స్ ని ఎంటర్ టైనింగ్ గా తీసుకొచ్చిన బిగ్ బాస్.. చివరి వారం మాత్రం హౌజ్ మేట్స్ తోపాటు వీక్షకుల్ని కూడా ఎమోషనల్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన శ్రీసత్య ప్రోమో దానికి ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది.
పసుపు కలర్ లెహంగాలో ఉన్న శ్రీసత్యకు ఫోన్ వచ్చింది. దాన్ని పిక్ చేయగానే అవతల వైపు నుంచి.. ‘నిన్ను చాలా మిస్ అవుతున్నాం. కొంచెం దూరంలోనే ఫైనల్స్ కప్ ఉంది. కన్ఫర్మ్ గా గెలుచుకుని ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సత్తి పండు’ అని శ్రీసత్య కుటుంబసభ్యులు చెప్పారు. ఇక దీని తర్వాత మాట్లాడిన బిగ్ బాస్.. ‘శ్రీసత్య.. మీరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో భయాలు, ప్రశ్నలు, అనుమానాలు, ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఓ సంకోచ స్థితి మీ దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి మీరొచ్చిన కారణం గుర్తొచ్చాయి. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు.. మీలోని మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని మీకు కాస్త సులువు చేశారు’ అన్ని అన్నాడు. అప్పటికే ఫుల్ ఎమోషనల్ అయిన శ్రీసత్య.. ‘ట్రూ బిగ్ బాస్’ అని కళ్లు తుడుచుకుని ఆన్సర్ ఇచ్చింది.
‘ భుజాలపై బరువుని పెంచితే, అది చిరునవ్వుతో మోస్తూ, ముందుకు కదిలి సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కొవడమో.. రెండే దారులు ఉంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొవడాన్ని ఎంచుకున్నారు. ఇలానే ముందుకెళ్లాలని ఆశీస్తూ ఆల్ ది బెస్ట్’ అని చెప్పిన బిగ్ బాస్.. శ్రీసత్య నవ్విస్తూనే ఏడిపించేశాడు. మరి శ్రీసత్య.. బిగ్ బాస్ కప్ గెలుస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతం శ్రీసత్యతో పాటు రేవంత్, శ్రీహాన్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి ఉన్నారు. వీళ్లలో ఎవరు విన్నర్ అనేది ఈ ఆదివారం తెలిసిపోతుంది.