గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోతుందని.. కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు.
ఏపిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చిప్ లు ఉండాల్సింది కాళ్లు, చేతులకు కాదని.. మెదడులో గుండెలో ఉండాలంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. కానీ తాము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీ 95 శాతం అమలు చేశామన్నారు. ప్రజలకు తాము చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా మళ్లీ తమనే గెలిపించి తీరుతారని అన్నారు.
తమ పార్టీ ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై ఇప్పుడు 150 మందికి చేరిందని.. ఒక్క ఎంపీ నుంచి 22మందికి చేరిందని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా తనపై ఒత్తిడి తీసుకు వచ్చారని.. కానీ ఆ సమయంలో నేను ధైర్యంగా ఉన్నానని లేదంటే ఈ రోజు మీ ముందు ఇలా ఉండేవాన్ని కాదని అన్నారు. ఇదంతా కార్యకర్తల కష్టఫలం. గతంలో తనపై ఎన్నో కుట్రలు పన్నారని.. ఒక్క శాతం ఓటింగ్ కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నానని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలు మొత్తం మార్చేశామని అన్నారు. గతంలో టీడీపీ హయాంలో కరెంట్ కోతతో సెల్ ఫోన్ లైట్లు వినియోగించి ఆపరేషన్లు చేసిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీ, చంద్రబాబు పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లే. ఆయన మామనైనా వెన్నుపోట్లు పొడుస్తారు. ప్రజలకి వెన్నుపోట్లు పొడుస్తారు. బాబు మాటలు ప్రజలు ఏనాటికీ నమ్మరు. జగన్ చెప్పింది నిజమని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయండన్నారు సీఎం జగన్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.