ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ వ్యవస్థాపకులు రామోజీరావుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని రఘురామ కొనియాడారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ‘ఈనాడు’ దినపత్రిక వ్యవస్థాపకులు, రామోజీ ఫిలింసిటీ సృష్టికర్త రామోజీరావుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామోజీ కేవలం తన కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదని.. ఆయన తెలుగు ప్రజలందరి ఆస్తి అని రఘురామ అన్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా రామోజీరావు ఫిలిం సిటీని నిర్మించారని రఘురామ కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం విలేకరులతో రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. ఆస్కార్ పురస్కార గ్రహీత కీరవాణి చెప్పిన మాదిరిగా బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలి అన్నట్లుగా గొప్పగా, నలుగురికి నిజమైన మార్గదర్శిలా ఆయన జీవిస్తున్నారని మెచ్చుకున్నారు.
మార్గదర్శి చిట్ఫండ్పై రాష్ట్ర సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని రఘురామ కృష్ణరాజు అన్నారు. న్యాయం రామోజీరావు వైపే ఉందనే విషయం కోర్టును ఆశ్రయిస్తే తేలిపోతుందన్నారు. ఎంతోమంది సంక్షేమంతో కూడిన మార్గదర్శి కంపెనీని మూసివేస్తానని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా వ్యవహరిస్తున్న ఆఫీసర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. కక్ష సాధింపులో భాగాంగానే ముఖ్యమంత్రి జగన్ ఐదు నెలల కింద రామకృష్ణను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా నియమించారని పేర్కొన్నారు. సెక్రటరీ స్థాయి కలిగిన అధికారిని మాత్రమే ఆ పోస్టులో నియమించాలని.. కానీ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి రామకృష్ణను ఎలా నియమించారని రఘురామ ప్రశ్నించారు.