అల్లారుముద్దుగా ఆడబిడ్డను పెంచుకున్నారు. పెళ్లీడుకు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. తమకున్నంతలో గొప్పగా.. కుమార్తె వివాహం జరిపించారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. భర్త ప్రేమానురాగాల కోసం ఎదురు చూసిన ఆమెకు.. అందుకు బదులుగా వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. పెళ్లైన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తామామలు.. నవ వధువును అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీని గురించి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి.. బాధపడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు.. కుమార్తెను చూడటానికి వెళ్తే.. ఆమె అక్కడ లేదు. పైగా అల్లుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని తెలిసి.. అక్కడకు వెళ్లిన బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక బాధితుల ఆందోళనతో.. నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కునపరాజుపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు.. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరి పెళ్లి అయ్యి మూడు నెలలే అవుతోంది. అయితే పెళ్లయిన నాటి నుంచే రాజ్ కుమార్, అతడి తల్లిదండ్రులు.. అదనపు కట్నం కోసం ఐశ్వర్యను వేధించసాగారు. దాంతో ఐశ్వర్య.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తన బాధ చెప్పుకుని కన్నీరుపెట్టుకుంది.
కుమార్తెను కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుసుకున్న ఐశ్వర్య తల్లిదండ్రులు.. తాజాగా కూతురిని చూడటానికి అత్తారింటికి వెళ్లారు. అక్కడ అత్తవారింట్లో వారికి ఐశ్వర్య కనిపించలేదు. అప్పటికే అల్లుడు రాజ్ కుమార్‌ను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. దాంతో.. ఐశ్యర్య కుటుంబసభ్యులు నూజివీడు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కుమార్తె గురించి ప్రశ్నించారు. కానీ సమాధానం రాకపోవడంతో.. అప్పటికే బిడ్డ కనిపించక ఆగ్రహంతో వున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి రాజ్ కుమార్‌పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఐశ్వర్య జాడ చెప్పాలంటూ కునపరాజుపర్వ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.