రాష్ట్రంలో వినాయక చవితి పండుగ నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవని.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండి పడ్డారు. మండపాల రుసుము విషయంలో ప్రభుత్వంపై కావాలనే కొందరు నిందలు వేస్తున్నారని.. కానీ తమ ప్రభుత్వం మండపాల రుసుమును ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో వినాయక చవితి పండుగ నిర్వహణపై మా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. పైగా, గణేష్ మండపాల అనుమతిని గతంతో పోలిస్తే.. ఇప్పుడు మా ప్రభుత్వం సులభతరం చేసింది. గతంలో గణేష్ మండపం ఏర్పాటు చేయాలంటే.. అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది.. కానీ మా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తెచ్చిందని’’ తెలిపారు.
అంతేకాక మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదని వెల్లంపల్లి వివరించారు. ఈ విషయంలో తాము గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామన్నారు. పైగా గత ప్రభుత్వంలో గణేష్ మండపానికి సంబంధించి 250 వాట్స్ వరకు విద్యుత్ వినియోగానికి రూ.1,000 చెల్లించాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు దాన్ని తమ ప్రభుత్వం రూ.500కు తగ్గించిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గణేష్ ఉత్సవాల గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి వెల్లంపల్లి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.