ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సరైన వసతులతు లేక గర్భిణీలను మంచాలపై, డోలీకట్టి కొండలు, గుట్టలు దాటుకొని ఆస్పత్రులకు తీసుకువస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఈ మద్య కొన్ని సంఘటనల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మృత దేహాలను తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు చనిపోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గర్భిణీలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. గర్భిణిగా ఉన్న ఓ గిరిజన మహిళను ఆశా వర్కర్, ఏ.ఎన్.ఎమ్ లు కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం గుడిలోవ నివసిస్తున్న మంగ అనే గిరిజన మహిళకు నెలలు నిండక ముందే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నొప్పుల బాధ తట్టుకోలేక మంగను చూసి ఆమె భర్త ఎస్.కోటలో ఉన్న ఏఎన్ఎమ్ లకు సమాచారం అందించారు. గ్రామ ఏఎన్ఎమ్ పార్వతీదేవి, ఆశా వర్కర్ లక్ష్మి ఇద్దరు హుటాహుటిన గర్భిణి ఇంటికి చేరుకొని ప్రాథమిక వైద్యం అందించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నప్పటికీ ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.
ఎస్. కోటకు వెళ్లేందకు ఎలాంటి రహదారి సౌకర్యం లేదు. తల్లీబిడ్డను కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించేందుకు ఆశా వర్కర్, ఏ.ఎన్. ఎమ్ లు సిద్దమయ్యారు. ఒక డోలీ కట్టి ఆ మహిళను గిరిశిఖర ప్రాంతం నుంచి కిందకు తమ భుజాలపై మోసుకుంటూ వచ్చారు. ఆ విధంగా గిరిజన మహిళ బాధను తమ బాధ్యతగా స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు మహిళా ఉద్యోగినులు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సరైన వసతీ ఏర్పాటు చేయడం లేదని.. కొన్నిసార్లు పురిటిలోనే బిడ్డను కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్, ఏ.ఎన్. ఎమ్ లు చేసిన పనికి గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.