ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మన పురణాలు, హైందవ సంస్కృతి.. వంటి వాటి గురించి ఎంతో సింపుల్‌గా.. సామాన్యులకు కూడా అర్థం అయ్యే రీతిలో వివరిస్తూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో చాగంటి కోటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమయ్యింది. అది ఏంటంటే.. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో శుక్రవారం (జనవరి 20) టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్‌వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా చాగంటి నియామకం గురించి ప్రకటించారు.
అంతేకాక ఈ సమావేశంలో మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. దీనిలో ముఖ్యమైంది.. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలానే గ్రామస్థులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందించనున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ గత మూడు సంవత్సరాలుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని.. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మరి టీటీడీలో చాగంటికి కీలక పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.