టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి… రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి.. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నారాయణ రెడ్డి తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగింది. ఆయనను 108 వాహనంలో యర్రగొండపాలెం లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణరెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి కారు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు.
ఇక ప్రమాద సమయంలో కారులో కందుల నారాయణ రెడ్డి, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలంలోకి దూసుకొని వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు కూడా ధ్వంసమైంది. విషయం తెలిసిన వేంటనే పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కందుల నారాయణ రెడ్డి సోమవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా మార్కాపురం నియోజకవర్గంలో పొదిలిలో పాదయాత్ర చేపట్టారు.